లంచం తీసుకొని దొరికితే పింక్ కలర్ బాటిల్స్ ఎందుకు పెడుతారో తెలుసా?

www.mannamweb.com


ప్రస్తుత రోజుల్లో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినా, లంచమే కనిపిస్తుంది.
అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారు. అయితే లంచం తీసుకున్నవారిని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రాంతంలో డబ్బులతో పాటు పింక్ కలర్ బాటిల్స్ కూడా కనిపిస్తుంటాయి. అయితే అసలు పింక్ కలర్ బాటిల్ అక్కడ ఎందుకు పెడుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినప్పుడు సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు ముందుగానే సమాచారం అందిస్తాడు. ఏసీబీ అధికారులు ఆ వ్యక్తికి లంచం ఇచ్చే డబ్బులపై ఫినాప్తలిన్ పౌడర్ చల్లుతారు. సదరు వ్యక్తి ఆ డబ్బులు లంచంగా ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చిన తరువాత ఆ ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు లెక్క పెడితే ఆ నోట్లకు ఉండే పినాప్తలిన్ పౌడర్ ప్రభుత్వ అధికారి చేతులకు అంటుకుంటుంది. అప్పుడే వెంటనే ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇస్తారు. లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో ముంచి బయటికీ తీస్తారు. నీటిలో ముంచడం వల్ల చేతికి అంటిన పినాప్తలిన్ పౌడర్ ఆ నీటిలో కలిసి పింక్ కలర్ రూపంలోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం కావడంతో అది పింక్ కలర్ గా ఏర్పడుతుంది. ఈ పింక్ కలర్ బాటిల్ ని కోర్టులో సాక్ష్యంగా చూపించడం ద్వారా లంచం తీసుకున్న అధికారికి శిక్ష పడేలా చేస్తారు.