పైన ఫోటోలో మీరు గుట్టలా పోసిన ఓ పదార్థాన్ని చూశారుగా… ఈ గుట్ట దేనికి సంబంధించిందని మీరు అనుకుంటున్నారు?పొలానికి వేసే ఎరువు అనుకుంటున్నారా?
గ్రామాల్లో పశువుల కొట్టం ముందు ఉండే కుప్ప అనుకుంటున్నారా… లేక వర్మి కంపోస్ట్ ఎరువు అనుకుంటున్నారా?
సరే.. మీరు ఈ కుప్పను చూసి ఏదో ఒకటి అనుకునే ఉంటారు. కానీ మీరు అనుకున్నది కానే కాదు.
ఇది ఒక కల్తీ ప్రొడక్ట్. మీరు ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజుకు మినిమం రెండు, మూడు , నాలుగు సార్లు తీసుకుంటారు. ఇప్పుడు మైండ్‌కు తట్టింది కదూ.. యస్.. ఇది చాయ్పత్తాయే.. కల్తీ చాయ్‌పత్తా.. అదేనండీ టీ పొడి. చెత్తలా ఎలా పోశారో చూశారుగా. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపఎర్రంపాలెంలో నకిలీ టీ పొడి గుట్టు రట్టయింది. రైస్ మిల్లులో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తోన్న కల్తీ టీ పొడి ఇది. దాదాపు వెయ్యి కిలోల కల్తీ చాయ్‌పత్తాను పోలీసులు సీజ్ చేశారు. టీ పొడి శాంపిల్స్‌ను టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపారు . ఈ నకిలీ టీ పొడే రేపు అందమైన ఆకర్షణీయమైన బ్రాండెడ్ కవర్స్‌లో ప్యాక్ అయి మన ఇంట్లో చేరుతుంది. మనల్ని రోగాల బారిన పడేస్తోంది.
చింతపిక్కల పొడి, జీడి పిక్కల పొడి, బేకింగ్ సోడా, బ్లాక్ ఫుడ్ కలర్, కొబ్బరి పీచు, పంచదార పాకం.. కొన్ని రకాల రసాయనాలు కలిపి టీ పొడి కలరింగ్ ఇచ్చి ప్యాక్ చేసి పంపుతారు. ఈ కల్తీ పొడితో చేసిన టీ తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇంతే కాదు తూకం కోసం ఇనుప రజను సైతం ఇందులో కలిపేస్తారు.
నకిలీ టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలంటే..
======
1. ఒక గ్లాసు నీటిలో టేబుల్‌స్పూన్ టీ పౌడర్ కలపాలి
2.నకిలీ టీ పొడి అయితే నీళ్లు త్వరగా రంగు మారుతాయి
3.టీ పొడి నీళ్లలో ముద్దముద్దగా మారుతుంది
4.స్వచ్ఛమైన టీ పొడి వాటర్‌లో వేస్తే నీళ్లు త్వరగా రంగు మారవు
5.స్వచ్ఛమైన టీ పొడి నీటి అడుగు భాగాన చేరుతుంది
6. టీ పొడి ప్యాక్ ఓపెన్ చేయగానే వాసన తేడాగా.. ఘాటుగా వస్తే ఆ పొడిని వాడకపోవడమే మంచిది
తినే తిండి కల్తీ, తాగే చాయ్ కల్తీ చేస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.