ఎప్పుడూ పడని వర్షపాతం… ఎన్నడూ చూడని వరుణ బీభత్సంతో వరదవాడగా మారిన విజయవాడ… దాదాపుగా సాధారణ స్థితికొచ్చింది. మొన్నటివరకు కనపడని రోడ్లు, భవనాలు…ఇప్పుడు శుభ్రంగా మెరుస్తున్నాయి.
మోటార్ సైకిళ్లు రయ్యన తిరుగుతున్నాయి. మనుషులు సైతం ఎలాంటి భయం లేకుండా బయటకొచ్చే పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, స్వచ్చంధ సేవకులు… ఇలా ఎందరో 10 రోజులు పాటు సమయం చూసుకోకుండా పనిచేశారు. బెజవాడను యథాస్థితికి తెచ్చేందుకు మూడు షిఫ్టుల్లో కష్టపడ్డారు. ఫలితంగా బెజవాడ ఊపిరి పీల్చుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం వరదపై అలుపెరగని పోరాటం చేశారు. 10 రోజలపాటు విజయవాడ కలెక్టరేట్లోనే బస చేశారు. ప్రతిరోజూ వరద ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకయ్యారు.. వారిలో భరోసా నింపారు.
ముమ్మర సహాయక చర్యలతో.. 90 శాతం నగరం యాథాస్థితికొచ్చింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఇప్పటిదాగా 30వేల 545 ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేశారు. 66 వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా… ముంపు ప్రాంతాల్లోని 90 శాతం ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించి వినియోగంలోనికి తెచ్చారు. 421 కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్త తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, సెల్లార్‌లోని నీటిని మోటార్లతో వెళ్లగొట్టి నగరాన్ని నార్మల్ సిచ్యువేషన్‌కి తీసుకొచ్చారు. దీంతో ప్రతి కష్టపడిన ప్రతిఒక్కరిని అభినందించారు సీఎం చంద్రబాబు.
విజయవాడ కోలుకోవడంతో.. కాకినాడ జిల్లాపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఏలేరు ప్రాజెక్టు విజృంభిస్తుండటంతో… పదుల సంఖ్యలో గ్రామాలు మునిగాయి. పలుచోట్ల కాల్వలకు గండ్లు పడటంతో… వందలాది ఎకరాలు నీట మునిగాయి. 10 సంఖ్యలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా… వాటిని వరద ముట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు చంద్రబాబు.
మొత్తంగా… వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు.. వరదల నుంచి కోలుకున్న తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.