దిల్లీ: కీళ్ల మధ్యన ఉండే మృదు పదార్థం అరిగిపోయిన కారణంగా సంభవించే ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్లవాతం) వ్యాధి లక్షణాలు- వ్యాయామంతో తొలగిపోయే అవకాశాలు చాలా తక్కువని ఒక అధ్యయనంలో తేలింది. ఈ స్థితిలో వ్యాయామం చేయడం.. ఏ చికిత్సా చేయకపోవడంతో సమానమేనని పేర్కొంది. వ్యాయామం మంచి ప్రభావం చూపినా అది కొద్దికాలమే నిలుస్తుందని స్పష్టం చేసింది. ‘‘రూమాటిక్ అండ్ మస్కులోస్కెలెటల్ డిసీజెస్’’ అనే జర్నల్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. కీళ్లవాతం వల్ల కలిగే నొప్పిని నివారించడానికి, శారీరక కార్యకలాపాల మెరుగుదలకు వ్యాయామమే అమోఘమైన పరిష్కారమంటూ సాగుతున్న ప్రచారాన్ని ఈ అధ్యయనం తోసిపుచ్చింది. జర్మనీలోని బోచుమ్ యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
ఆస్టియో ఆర్థరైటిస్‌కు వ్యాయామాన్ని ప్రారంభ చికిత్సగా సిఫార్సు చేస్తుంటారు గానీ దానివల్ల ఫలితాలు స్వల్పకాలికమైనవే అనడానికి వైజ్ఞానిక సాక్ష్యాలున్నాయని పరిశోధకులు తెలిపారు. వ్యాయామం ద్వారా కీళ్లవాతం నివారించవచ్చని ఇప్పటివరకూ ప్రచురితమైన నివేదికలపై సమగ్ర సమీక్ష జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 12 వేల మందిపై 28 చికిత్సాపరమైన పరీక్షలు, ఐదు శారీరక సమీక్షలు నిర్వహించి గణాంకాలను విశ్లేషించారు. ఇతర చికిత్సలతో పోలిస్తే కీళ్ల వాతానికి వ్యాయామమే సరైన విరుగుడని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేవని పెదవి విరిచారు. తుంటికీలుకు సోకిన ఆర్థరైటిస్ నివారణకు వ్యాయామం ఏమాత్రం ప్రయోజనకారి కాదని, చేతి కీళ్లపై కొంతవరకూ ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. వ్యాయామంతో పోలిస్తే కీళ్ల శస్త్రచికిత్స (ఆస్టియోటమీ), జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్ర చికిత్సలే దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని వెల్లడైనట్టు వివరించారు.


































