భారతదేశంలోని యువత ఎక్కువగా బైక్స్ వాడకాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అధునాతన ఫీచర్స్‌తో వచ్చే సూపర్ బైక్స్ వాడడానికి ముందుకు వస్తున్నారు.
సాధారణంగా భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలోని బైక్ మార్కెట్‌లో హీరో కంపెనీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌లతో పాటు యువతను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే సూపర్ బైక్స్‌ను హీరో కంపెనీ లాంచ్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరో కంపెనీ హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీని భారతదేశం అంతటా సింగిల్ డిస్క్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధరను రూ. 1,11,111 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ బైక్ గురించి వివరాలను తెలుసుకుందాం.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ప్రత్యేకమైన జోడింపుల్లో ఒకటిగా సెగ్మెంట్ మొదటి డ్రాగ్ రేస్ టైమర్‌తో వస్తుంది. ఈ వినూత్న ఫీచర్ రెండు విభిన్న మోడ్‌లతో వస్తుంది. ముఖ్యంగా డీ1, డీ2 ఫీచర్లు బైక్‌ను వేగంగా నడిపే రేసర్లకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీ కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్‌తో వస్తుంది. ముఖ్యంగా ప్రీమియం డిజైన్, విలక్షణమైన “హెచ్” గుర్తు బైక్ ప్రియులను మరింతగా ఆకర్షిస్తాయి.
ఈ అప్‌డేట్‌లో రైడర్ కంఫర్ట్‌కు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. పిలియన్ సీటును తక్కువ ఎత్తుతో రీడిజైన్ చేశారు. అందువల్ల రైడర్లు చాలా సురక్షితంగా రైడ్ చేయవచ్చు. వెనుక వైపు గ్రిప్ స్పాన్ ఉండడం వల్ల రైడర్, పిలియన్ ఇద్దరూ మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ప్రస్తుతం హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీ బైక్ ప్రత్యేకంగా స్టీల్ బ్లాక్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త వేరియంట్ అత్యాధునిక లుక్‌తో సూపర్ స్టైలిష్ ఫీచర్స్‌తో వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.