ప్రకృతి నుంచి వచ్చే పండ్లు, కూరగాయలను అలాగే తినాలని, వాటిని జ్యూస్ లు తీసి తాగడం మంచిది కాదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) వ్యవస్థాపకుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి చెప్పారు.
ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే హెల్దీ లైఫ్ ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ సమాన వైద్యం అందడంలేదని, అందరికీ ఉచిత వైద్యం కూడా సాధ్యం కావట్లేదన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పెరిగిందన్నారు. ప్రభుత్వాలే ప్రజలకు ప్రీహెల్త్ చెకప్ లు చేసేందుకు కొత్త స్కీంలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలకు ట్రీట్మెంట్ చేసినందుకు తనను సెలబ్రిటీల డాక్టర్ అంటుంటారని.. కానీ తాను ఎప్పుడూ సామాన్య ప్రజల డాక్టర్నే అని స్పష్టం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
”నాన్ వెజ్ తక్కువగా, వెజ్ ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ మానేయాలి. వీటితోపాటు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మరోవైపు సెలబ్రిటీలు చిప్స్, ఇతర జంక్ ఫుడ్ ప్రకటనలు చేయకూడదు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల పిల్లలు ఆకర్షితులవుతున్నారు. ఇక ప్రొటీన్లు రోజుకు ప్రతి మనిషికి ఒక కిలో బరువుకు ఒక గ్రాము అవసరం. అంటే 60 కిలోల వ్యక్తికి 60 గ్రాములు చాలు. పిండిపదార్థాల్లో రైస్, బ్రెడ్, షుగర్ వంటివి మంచివికాదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే మిల్లెట్స్ మంచివి. ఫ్యాట్ లో కూడా మంచివి, చెడువి ఉంటాయి. మళ్లీ మళ్లీ వేడి చేసే నూనెలతో చేసిన ఆహారం కూడా తినొద్దు”
భారతీయుల్లో ప్రధానంగా డయాబెటిక్ సమస్య వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు ఎక్కువగా ఉన్నాయి. మనవాళ్లలో ఎక్కువగా ట్రంకల్ ఒబెసిటీ సమస్య వస్తోంది. అందుకే మంచి ఫుడ్, వ్యాయామంతో ఫిజికల్ హెల్త్ ను కాపాడుకుంటే సమస్యను బాగా తగ్గించవచ్చు. ఫుడ్ లో ప్రధానంగా కార్బొహైడ్రేట్స్ తగ్గించి, మిల్లెట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మేలు జరుగుతుంది.