మానుకోట జిల్లాలోని బంగారు దుకాణాల్లో జీరో దందా జోరుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు కోట్లలో లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని మాత్రం నామమాత్రం చెల్లిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లోని చిన్నాపెద్ద బంగారు దుకాణాలు సిండికేట్‌గా మారి బిల్లు లివ్వకుండా వ్యాపారం సాగిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బంగారం వ్యాపారులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ నుంచి ముడి బంగారాన్ని, ఆభరణాలను తీసుకువచ్చి మానుకోటలో విక్రయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ముందుగా బంగారం కొనుగోలుదారులు నచ్చిన డిజైన్ ఎంచుకున్న తర్వాత ఆ డిజైన్‌లో బంగారు ఆభరణాలను విజయవాడ, జగ్గయ్యపేటలో తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి తీసుకువచ్చి జీరో దందాతో మానుకోట పట్టణంతో పాటు కురవి, మరిపెడ, తొర్రూరు పట్టణాల్లో బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నట్టు సమాచారం. వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా కేవలం బుక్ చిట్టీలు మాత్రమే అందజేస్తున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారు. దీంతో ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయానిక గండికొడుతూ మరోవైపు వినియోగదారులు నాణ్యత, తూకం వంటి అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దుకాణాల్లో పని చేసే వర్కర్లతో ఉదయం 9గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పెళ్లిళ్ల సీజన్ తో పెరిగిన కొనుగోళ్లు..
ఈ నెల చివరి వారంలో పెళ్లిళ్ల సీజన్, శుభముహూర్తాలు ఉండడంతో ముందుగానే బంగారం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బంగారం రేటు లక్షల్లో ఉన్నా కొనుగోలు తప్పనిసరి కావడంతో చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మహబూబాబాద్‌కు వచ్చి అభరణాలు కొనుగోలు చేస్తున్నారు.ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని గల్లీ గల్లీకి దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఎస్టీతో కూడిన అధికారిక బిల్లులు ఇవ్వకుండా నగదు లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
కమర్షియల్ ట్యాక్స్ అధికారుల నిర్లక్ష్యం.?
జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ శాఖ పర్యవేక్షణ కొరవడిందనే అభిప్రాయం ఉంది. బంగారు దుకాణాల్లో జీఎస్టీ ఎగవేత జరుగుతోందన్న ఆరోపణలపై ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదులు అందకపోవడం గమనార్హం. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వినియోగదారులకు సూచనలు..
బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జీఎస్టీ బిల్లు తీసుకోవాలి.
బిల్లులో జీఎస్టీ నంబర్, బంగారం తూకం, శుద్ధి శాతం స్పష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి.
బుక్ చిట్టీలను స్వీకరించకుండా అధికారిక పన్ను బిల్లులనే కోరాలి.
జిల్లాలో బంగారు దుకాణాలపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది సంబంధిత శాఖ సమగ్ర తనిఖీలు నిర్వహిస్తేనే తేలనుంది. పన్ను ఎగవేతలపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా, వినియోగదారుల హక్కులు కూడా పరిరక్షితమవుతాయి.
గ్రీవెన్స్ లో యువకుడు ఫిర్యాదు..
మానుకోట పట్టణ పరిధిలో అనుమతి లేని బంగారం, వెండి కొనుగోళ్లు చేస్తూ వినియోగదారులకు బిల్లులు ఇవ్వకుండా జీరో దందాకు తెరలేపారని ఓ యువకుడు సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. బిల్లులు ఇవ్వండి అంటే జీఎస్టీ పడుతుందంటూ బంగారు దుకాణ యజమానులు మభ్యపెడుతున్నారని, కమర్షియల్ టాక్స్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. షాపుల్లో పని చేసే వారితో సమయపాలన లేకుండా వర్క్ చేపిస్తున్నారని, దుకాణాల్లోని సీసీ ఫుటేజ్ లను పరిశీలించాలని వినతి ప్రం అందజేశారు.



































