Gold Loan: గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. బ్యాంక్ నుంచి రోజూ రూ.5 వేలు వసూల్ చేయండిలా..

కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా ఆదుకునేది మన ఇంట్లోని బంగారమే. అందుకే చాలామంది అత్యవసర సమయంలో గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. అయితే బంగారం తాకట్టు పెట్టడం అంటే కేవలం నగలు ఇచ్చి డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు.. దీని వెనుక ఆర్బీఐ రూపొందించిన కఠినమైన నిబంధనలు, లోన్ టు వాల్యూ లెక్కలు, మనకు తెలియని అనేక వినియోగదారుల హక్కులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
ఏ బంగారానికి లోన్ వస్తుంది: అన్ని రకాల బంగారంపై బ్యాంకులు లోన్ ఇవ్వవు. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలకు మాత్రమే లోన్లు ఇస్తాయి. 24 క్యారట్ గోల్డ్ బార్లు, బిస్కెట్లు, గోల్డ్ ETFలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ రాదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైమరీ గోల్డ్ లోన్లకు అనర్హం.


లోన్ టు వాల్యూ: బంగారం విలువలో బ్యాంకులు ఇచ్చే అప్పు శాతాన్ని LTV అంటారు. ప్రస్తుతం ఇది లోన్ మొత్తాన్ని బట్టి మారుతుంది. రూ. 2.5 లక్షల వరకు 85శాతం వరకు లోన్. రూ.2.5 నుండి 5 లక్షల వరకు: 80శాతం LTV, రూ.5 లక్షల పైన 75శాతం LTV లోన్ వస్తుంది. ఉదాహరణకు.. బంగారం ధర ప్రస్తుతం గ్రాముకు సుమారు రూ.16,100 ఉండగా.. 75శాతం LTV ప్రకారం..గ్రాముకు రూ.12,000 వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది.

పరిమితులు: ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో బంగారం తాకట్టు పెట్టవచ్చు. బంగారం విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ, బ్యాంకులు గరిష్ట పరిమితిని విధిస్తాయి. ఉదాహరణకు SBIలో గరిష్టంగా రూ.50 లక్షల వరకే లోన్ ఇస్తారు. బంగారు నాణేల విషయానికి వస్తే కేవలం 50 గ్రాముల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఎలా లెక్కిస్తారు?: బ్యాంకులు మీ ఆభరణాల్లోని రాళ్లు లేదా వజ్రాల బరువును పరిగణనలోకి తీసుకోవు. కేవలం నికర బంగారం బరువును మాత్రమే చూస్తారు. గత 30 రోజుల సగటు ధర లేదా ముందు రోజు ముగింపు ధరలో ఏది తక్కువైతే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.

కొత్త రూల్స్: చాలా మందికి కొన్ని కీలక విషయాలు తెలియవు. మీరు లోన్ మొత్తం తిరిగి చెల్లించిన తర్వాత బ్యాంక్ మీ బంగారాన్ని వెంటనే అప్పగించాలి. ఒకవేళ బ్యాంక్ ఆలస్యం చేస్తే ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున బ్యాంక్ మీకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లోన్ పీరియడ్‌లో మీ బంగారం డ్యామేజ్ అయినా లేదా ప్యూరిటీ తగ్గినా, దానికి బ్యాంక్ పూర్తి బాధ్యత వహించాలి. తగిన పరిహారం ఇవ్వాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.