శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల విడుదల ఆరోజే

www.mannamweb.com


తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ, అంగప్రదక్షిణ తదితర సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించి నవంబరు నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సోమవారం (ఆగస్టు 19) నుంచి విడుదల చేయనుంది.

ఆర్జిత సేవా టికెట్లను సోమవారం (ఆగస్టు 19న) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఆగస్టు 21న ఉదయం 10 వరకు శ్రీవారి భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్‌లో ఈ సేవా టికెట్లు పొందినవారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

శ్రీవారి ఆలయంలో నవంబర్ మాసంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలకు సంబంధించిన వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

అలాగే శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్లను ఆగస్టు 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను గస్టు 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకునేందుకు కల్పిస్తున్న ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆగస్టు 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు, గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

తిరుమల-తిరుపతి శ్రీవారి సేవా కోటా ఆగస్టు 28న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.