ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది.. రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది..
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.1000 స్టాంపు డ్యూటీగా వసూలు చేస్తారు. భూ యజమానులు మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయి.
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే భూముల విషయంలో ఇబ్బందులు ఉండేవి. గతంలో వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని.. కేవలం కాగితాలపై రాసుకునేవారు. కానీ ఈ మ్యుటేషన్లు (యాజమాన్య మార్పులు) సకాలంలో జరగడం లేదు.. తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులుపడుతున్నారు. ఈ అంశంపై భారీగా ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వీలునామా రాయకుండా తల్లిదండ్రులు చనిపోతే.. వారి వారసులు ఆ ఆస్తుల్ని పంచుకుని, లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే సరిపోతుంది. అలాంటి వారికి ఆస్తుల్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100 లేదా రూ.1000కే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించింది. గతంలో 2021లో విధించిన ఫీజులను ఇప్పుడు సవరించారు. ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100 స్టాంపుడ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. అదే ఆస్తి విలువ రూ.10 లక్షలు దాటితే రూ.1,000 స్టాంపుడ్యూటీగా చెల్లించాలి. 2021కి ముందు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను కుటుంబ సభ్యులు భాగపంపిణీ చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ విలువలో అత్యధిక వాటా ఉన్న ఒక సభ్యుడికి మినహాయింపు లభించేది. మిగిలిన ఇద్దరు సభ్యుల వాటాకు మాత్రం, ఆస్తి విలువలో 1% స్టాంపుడ్యూటీ వసూలు చేసేవారు. ఉదాహరణకు, రూ.15 లక్షల విలువైన ఆస్తిని ముగ్గురు కుటుంబ సభ్యులు సమానంగా పంచుకుంటే, రూ.5 లక్షలు మినహాయించి, మిగిలిన రూ.10 లక్షలపై 1% చొప్పున రూ.10,000 స్టాంపు రుసుము చెల్లించాల్సి వచ్చేది. వారసత్వ ఆస్తిని కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎక్కువగా, మిగిలినవారు తక్కువగా తీసుకుంటే, ఎక్కువగా పొందిన విలువపై 3% స్టాంపు రుసుము వసూలు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ నిబంధనలను సరళతరం చేశారు.
గతంలో నిబంధనల వల్ల రిజిస్ట్రేషన్ రుసుములు చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారాయి. దీంతో వారు అధికారికంగా భూముల యాజమాన్యాన్ని మార్చుకోలేకపోతున్నారు. కేవలం 100 రూపాయల స్టాంపు పత్రాలపై ఒప్పందాలు చేసుకోవడం వల్ల, భూముల రికార్డులలో మార్పులు (మ్యుటేషన్) జరగడం లేదు. దీనివల్ల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితి తరచుగా సివిల్ వివాదాలకు దారితీస్తోంది. ఉదాహరణకు, ఒక రైతు తన భూమిని అమ్మినప్పుడు, కుటుంబ సభ్యులందరూ వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కూడా సమర్పించాల్సి వస్తుంది. ఇది రైతులకు అదనపు భారం అవుతోంది. రైతులు తమ భూమిని తామే స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ, దాని రిజిస్ట్రేషన్ విలువపై మళ్లీ 1%, 3% చొప్పున స్టాంపు రుసుము ఎందుకు చెల్లించాలనేది వారి ప్రశ్న. ఈ అధిక ఖర్చుల వల్లనే వారు అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు.
అందుకే ఏపీ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ‘రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షల వరకు ఉంటే స్టాంపు రుసుముగా రూ.100 తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షలకు మించితే రూ.1,000 చెల్లించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, ఆటోమేటిక్‌గా ఆ భూముల యాజమాన్యం వారి పేరు మీదకు వస్తుంది. దీనివల్ల వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయబడతాయి. ఈ పాసుపుస్తకాలతో, ఆ భూములపై రైతులకు పూర్తి హక్కులు లభిస్తాయి. ఒకవేళ కుటుంబ పెద్ద వీలునామా రాయకుండానే మరణిస్తే, అప్పుడు ఆయన పేరు మీద ఉన్న ఆస్తులను ఆయన భార్య, పిల్లలు కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలోనే ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేయబడింది. ఇతర ఆస్తులకు ఇవి వర్తించవు.


































