ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది.
ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అదే సమయంలో ఇతర శాఖల్లో ఖాళీల భర్తీ దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కసరత్తు జరుగుతోంది.
నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. మార్చి 19న తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభం కానుండగా.. ఆ రోజున డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ విద్యాశాఖ ఖాళీల వివరాలను సేకరిస్తుండగా.. దాదాపు 3,600 ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ పోస్టులకు మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. ప్రతీ ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఈ ఏడాది డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదర్శ, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, సంక్షేమ శాఖల స్కూళ్లల్లో 1200 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,700 ఖాళీ ఉన్నాయి. ఇక ప్రత్యేక విద్య పోస్టులు 700 వరకు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 3600 వరకు పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 పోస్టుల భర్తీని ఇప్పటికే చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్ ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి.
ఉగాది నాటికి డీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్
కాగా, రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయాయి. ఇక కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న టీచర్లకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది డీఎస్సీ పరీక్షకు సిద్దం చేసిన సిలబస్‌నే ఈసారి డీఎస్సీకి అమలు చేయనున్నారు. పరీక్ష సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సిలబస్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే తొలుత అభ్యర్థులకు కంప్యూటర్, ఇంగ్లీష్ ప్రావీణ్యం టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ సమయం లేనందున ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. అటు ప్రత్యేక అవసరాలు ఉన్న స్కూళ్లల్లో దాదాపు 2,600 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్, టెట్‌లో పాస్ అయిన వారికి డీఎస్సీలో వెయిటేజీ కల్పించనున్నారు. ఇక, వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల లెక్కలు సిద్దం చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.


































