Govt OTT : ఓటీటీ రంగంలోకి కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుపెట్టబోతోంది. త్వరలో ప్రారంభమయ్యే భారత ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రసారభారతి సంస్థ ఆధ్వర్యంలో పనిచేయనుంది. ఇందులో ప్రధానంగా భారతీయ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేయనున్నారు. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్ ను కూడా ఇందులో కవర్ చేయనున్నారు అశ్లీలతకు తావులేని క్లీన్ కంటెంట్‌ను ఈ ఓటీటీ ద్వారా అందించనున్నారు. తొలుత ఒకటి, రెండు సంవత్సరాల పాటు దీన్ని భారతీయులంతా ఉచితంగా వాడుకోవచ్చని, ఆ తర్వాత రేట్లను డిసైడ్ చేస్తారని సమాచారం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారమవుతున్న కంటెంట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర సర్కారు(Govt OTT) ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఓటీటీ మార్కెట్‌లోకి ఈ ఏడాది ప్రారంభంలోనే కేరళ ప్రభుత్వం ఎంటరైంది. ‘సీస్పేస్’ (CSpace) పేరుతో ఓటీటీ సర్వీస్‌లను ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఓటీటీలో రూ.75కే యూజర్లు సినిమా చూడొచ్చు. తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ‘పే ఫర్ వ్యూ’ ఆధారంగా నిర్మాతలకు చెల్లింపులు చేస్తారు. నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే సీస్పేస్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేయాల్సిన కంటెంట్‌ను ఎంపిక చేసేందుకు 60 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ నియమించారు. సీస్పేస్ కోసం ఇప్పటి వరకు వందలాది మూవీఎస్‌ను ప్రసారం చేసేందుకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్ నుంచి అనుమతి పొందిన షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలను మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.
ఈ ఏడాది మార్చిలో 18 ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆయా ఓటీటీల్లో అశ్లీలత శృతిమించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా వేదికలను బ్లాక్ చేసింది. అశ్లీల కంటెంట్‌ని తొలగించాలని, చాలా రోజుల నుంచి ఈ ఫ్లాట్‌ఫామ్స్‌ను కేంద్రం హెచ్చరిస్తోంది. అయినా స్పందించకపోవడంతో వాటిపై వేటు వేసింది. సృజనాత్మకత చూపేందుకు మాత్రమే ఓటీటీలకు స్వేచ్ఛ ఉందని, ఆ పేరున హద్దులు దాటితే క్షమించేది లేదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తుండటం గమనార్హం.