కొంచెమైనా.. ముంచేస్తుంది!

www.mannamweb.com


అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు.

కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్‌ తీసుకున్నా కేన్సర్‌ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్‌కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్‌ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..

ఆల్కహాల్‌కు కేన్సర్‌కు లింకేమిటి?
⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్‌ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్‌ రీసెర్చ్‌ విభాగం కూడా ఆల్కహాల్‌ను ప్రధానమైన కేన్సర్‌ కారకాల్లో (గ్రూప్‌ 1 కార్సినోజెన్‌) ఒకటిగా గుర్తించడం గమనార్హం.
⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్‌ కారణంగా కేన్సర్‌ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది
⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్‌ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్‌ కేసులు… 7.4 లక్షల మంది.

(ఒక డ్రింక్‌ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)
7 ఆల్కహాల్‌తో రకాల కేన్సర్ల ముప్పు

పొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్‌ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్‌కు ముఖ్య కారణంగా ఆల్కహాల్‌ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆల్కహాల్‌ కేన్సర్‌కు దారితీసేదిలా..
1. శరీరంలో ఆల్కహాల్‌ అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్‌ఏను దెబ్బతీసి, కేన్సర్‌ ముప్పును పెంచుతుంది.
2. ఆల్కహాల్‌ శరీరంలో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్‌ఏను దెబ్బతీసి కేన్సర్‌కు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది.
3. ఆల్కహాల్‌ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్‌ ముప్పు పెరుగుతుంది.
4. కేన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్‌ కారణమవుతుంది.

ఎంత తాగితే.. అతిగా తాగినట్టు?
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్‌ ఆల్కహాల్‌ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్‌ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది.

అక్కడి అధ్యయనం మనకెందుకు?
ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్‌ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్‌లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్‌ అంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు… 2020లో భారత్‌లో కొత్తగా 62,100 ఆల్కహాల్‌ ఆధారిత కేన్సర్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్‌ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.

మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.

మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?
రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకున్నా కేన్సర్‌ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం… ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.