వాషింగ్టన్: అమెరికాలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీనికి తోడు బలమైన గాలులు వణికిస్తున్నాయి. న్యూయార్క్ సహా ఈశాన్య అమెరికా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రయాణాలపై నిషేధం, మంచు తుపాను హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. మేరీల్యాండ్ మొదలు మైన్ వరకు మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. విమానాల ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌అవేర్’ ప్రకారం.. 5,000కుపైగా విమానాలు రద్దయ్యాయి. వీటిలో చాలా వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్‌ల నుంచి రాకపోకలు సాగించాల్సినవే ఉన్నాయి.
న్యూయార్క్ నుంచి మసాచుసెట్స్ వరకు సోమవారం తెల్లవారుజామున గంటకు 2- 3 అంగుళాల (5- 7.6 సెం.మీ) చొప్పున మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఒక అడుగు (30 సెం.మీ) మేర నమోదైంది. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మాక్‌ఆర్థర్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం నాటికి 22.5 అంగుళాల (57 సెం.మీ) దట్టమైన మంచు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. కనెక్టికట్‌లోని న్యూ లండన్‌లో, రోడ్ ఐలాండ్‌లోని నార్త్ కింగ్స్‌టౌన్‌లో 17 అంగుళాల (43 సెం.మీ) చొప్పున హిమపాతం సంభవించింది. గంటకు 48 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు అసాధ్యమని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. ప్రమాదకరమైన మంచు తుపాను పరిస్థితుల కారణంగా సోమవారం మధ్యాహ్నం వరకు అత్యవసరం కాని ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ అధికారులు ప్రకటించారు. రోడ్ ఐలాండ్, న్యూజెర్సీలు సైతం ఇలాంటి ఆంక్షలను అమలు చేశాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకున్నారు. న్యూయార్క్ సిటీ, ఫిలడెల్ఫియా తదితర నగరాల్లో, డెలావేర్ నుంచి మసాచుసెట్స్ వరకు ;పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.




































