రాష్ట్రంలో హోంగార్డులకు కానిస్టేబుల్ ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాథమిక రాత పరీక్షల్లో కనీస మార్పులు రావాల్సిందేనని రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ హైకోర్టుకు నివేదించారు.
పోలీసు కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారని పలువురు హోంగార్డులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని ఎస్ఎల్పీఆర్బీని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ రవి ప్రకాశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీసు కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కు లేదని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు సైతం స్పష్టం చేసిందని కౌంటర్లో పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లు అందరికీ స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు.
వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్‌ను తప్పుపడుతున్నారని కౌంటర్లో వివరించారు. నోటిఫికేషన్‌లోని పేరా-7లో పేర్కొన్న స్పెషల్ కేటగిరీలు హారిజాంటల్ రిజర్వేషన్ (హోం గార్డులు, ఎన్సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసులు పిల్లలు తదితరులు) కిందకు వస్తాయని కౌంటర్ స్పష్టం చేశారు.
ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని అన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని తెలిపారు. ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధం అవుతుందని హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయస్సు మినహాయింపు కోరుతున్నారని తెలిపారు.
తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామని తెలిపారు. కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్తులకు లేదని, వీటిని పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసి, పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించారు.
గత వైసీపీ ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,100 పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీనిపై కోర్టులో కేసులు వేశారు. అయినప్పటికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అలాగే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఆ తరువాత నిర్వహించాల్సిన మెయిన్స్ రాత పరీక్ష జరగలేదు. ఈలోపు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. అంతే వాటికి అతీలేదు, గతీలేకుండా పోయింది.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 5న పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.