ఇటీవల కాలంలో యువత స్మార్ట్ యాక్ససరీస్‌ను వినియోగించడాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. సాధారణంగా భారతదేశ జనాభాకు తగ్గట్టే స్మార్ట్ వాచ్‌లు వాడే వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హువాయ్ వాచ్ జీటీ4 పేరతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. ముఖ్యంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా ఈ స్మార్ట్ వాచ్‌ను రూపొందించారు. అక్టాగోనల్ డిజైన్‌లో లాంచ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా యువతను ఆకట్టుకుంటుందని హువాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లు రెండింటికీ ఈ వాచ్‌ను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో హువాయ్ జీటీ-4 గురించి వివరాలను తెలుసుకుందాం.
హువాయ్ జీటీ-4 వాచ్‌ను రూ. 14,999 ధరతో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వా ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మొదటి 100 మంది కొనుగోలుదారులకు కంపెనీ 500 రూపాయల తగ్గింపును కూడా అందిస్తోంది. హువాయ్ వాచ్ జీటీ-4 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. బ్లూమింగ్ వాచ్ ఫేస్ వంటి డైనమిక్ ఆప్షన్లతో సహా కస్టమ్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. హువాయ్ వాచ్ జీటీ-4 స్టెయిన్లెస్ స్టీల్ కేసింగ్‌తో అందుబాటులో ఉంటుంది. సైడ్ బటన్‌తో పాటు రోటేటబుల్ క్రౌన్ ఆకట్టుకుంటుంది.
హువాయ్ వాచ్ జీటీ-4 స్మార్ట్ వాచ్‌లో యాక్సిలెరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ వంటి బహుళ సెన్సార్లు ఉంటాయి. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వస్తుంది. అలాగే అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్‌తో వచ్చే వాచ్ 4 జీబీ + 32 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ ట్రూసీన్ 5.5 ప్లస్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును విశ్లేషించడంతో పాటు అరిథ్మియా ప్రమాదాలను గుర్తిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మీ ఎస్పీఓ-2 స్థాయి, నిద్రను కూడా ట్రాక్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.