ప్రమాదవశాత్తు మెట్లపై పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ భర్త మృతిచెందగా.. భర్త ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మనస్తాపంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34) గోదావరిఖని జీడీకే-1 గనిలో ట్రామర్‌గా పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను ప్రేమించి 14 నెలల కిందట వివాహం చేసుకొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఉదయ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈనెల 16న శివరాత్రి జాగరణ కోసం కాళేశ్వరం వెళ్లి వచ్చారు. మరుసటి రోజు మమత శ్రీరాంపూర్ సీసీ కాలనీలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. నరేశ్ నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు పడిపోగా తలకు బలమైన గాయాలయ్యాయి. ఇంటి యజమాని గమనించి మమతకు సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకొని సింగరేణి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం కరీంనగర్‌కు తరలించారు. నరేశ్‌ను పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, అయినప్పటికీ జీవచ్ఛవంలా ఉండాల్సిందేనని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన మమత అదే రోజు రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న నరేశ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆరు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడం ఇరు కుటుంబాలను విషాదంలో ముంచింది. మృతుడి తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. భర్త, అత్తామామల వేధింపుల కారణంగానే మమత ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కరీంనగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.



































