రెస్టారెంట్ స్టైల్ “గుత్తి వంకాయ కూర” ఇలా చేస్తే వేళ్లు కూడా నాకేస్తారు.

తెలుగు వారి వంటింట్లో కూరగాయల రాజు వంకాయకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. “వంకాయ వంటి కూర.. వావి వరుసల వంటి చుట్టం లేదు” అనే సామెత వంకాయకు ఉన్న ఆదరణను చాటిచెబుతుంది.


చిన్న గుండ్రటి వంకాయల నుండి పొడుగు వంకాయల వరకు, ముదురు ఊదా రంగు నుండి తెల్లని రంగు వరకు ప్రతి రకానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అందుకే వంకాయతో చేసే వంటకాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. కాగా పోషక విలువలు రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా వంకాయలో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, ఫైబర్ (పీచు పదార్థం) సమృద్ధిగా ఉంటుంది.

ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. కొంతమందికి దీని వల్ల చర్మ అలర్జీలు లేదా దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు లేదా ఎలర్జీ ఉన్నవారు వంకాయను తక్కువగా తీసుకోవడం మంచిది. ఏ మసాలాతోనైనా ఇట్టే కలిసిపోయి, అద్భుతమైన రుచిని ఇవ్వడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘గుత్తి వంకాయ’ కూరను అత్యంత రాజభోగంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాల్లో ఈ కూర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ టేస్టీ కూర ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు:

వంకాయలు: 250 గ్రాములు (లేతవి)

ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)

టమాటాలు: 2 (సన్నగా తరిగినవి)

నూనె: 3 టేబుల్ స్పూన్లు

ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు: 1 టీస్పూన్ చొప్పున

వెల్లుల్లి: 6 రెబ్బలు (చిదిమినవి)

పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)

కరివేపాకు: కొద్దిగా

పసుపు: ¼ టీస్పూన్

ఉప్పు, కారం: రుచికి సరిపడా

కొత్తిమీర: అలంకరణకు

మసాలా పేస్ట్ కోసం..

నువ్వులు, వేరుశనగ (వేయించినవి), కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా చింతపంతరసం (లేదా టమాటా గుజ్జు) కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

తయారీ విధానం:

ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, చివర్లను తీసి, నాలుగు ముక్కలుగా లేదా మధ్యలో చీల్చి, ఉప్పు నీటిలో వేసి నానబెట్టాలి (ఇలా చేయడం వల్ల నల్లబడకుండా ఉంటాయి).

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడే వరకు వేయించాలి.

టమాటాలు, మసాలా: టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.

నానబెట్టిన వంకాయలను నీరు తీసి మసాలాలో వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి సన్నని మంటపై మెత్తగా ఉడికించాలి (సుమారు 8-10 నిమిషాలు).

చివరిగా కూర దగ్గరపడి, వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత, కొత్తిమీరతో అలంకరించి అన్నం, చపాతీతో వేడివేడిగా వడ్డించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.