విటమిన్ A, K, C లతో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పుష్కల పోషకాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకుల సువాసనలో ఉండే నేచురల్ ఆయిల్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.
భోజనం వెంట కోతిమీర చేర్చిన వంటకాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అపచయం వంటి సమస్యలు సహజంగా తగ్గుతాయి. ఇది యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో శరీరంలో వాపులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కాగా ఆంధ్రా వంటల్లో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో కొత్తిమీర పచ్చడికి చాలామంది అధిక ప్రాధాన్యత ఇస్తారు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి లేదా నూనె వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే ఆ రుచి అమృతమేనని చెప్పేవారు చాలామంది ఉన్నారు. రుచికరమైన ఈ పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా…
కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్ధాలు..
- కొత్తిమీర – 2 కట్టలు
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- వేరుశనగలు – 1 టేబుల్ స్పూన్
- పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
- ధనియాలు – 1 టేబుల్ స్పూన్
- నువ్వులు – 1 టేబుల్ స్పూన్
- మినపగుండ్లు – 1 స్పూన్
- జీలకర్ర – 1 స్పూన్
- ఆవాలు – అర స్పూన్
- మెంతులు – పావు స్పూన్
- పచ్చిమిర్చి – 3
- ఎండుమిర్చి – 4
- టమాటాలు – 2
- చింతపండు – కొద్దిగా
- ఉప్పు – తగినంత
- ఉల్లిపాయ – 1
తాలింపు కోసం..
అర స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపపప్పు. ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చి. 1 స్పూన్ నూనె, చిటికెడు ఇంగువ సిద్ధం చేసుకోవాలి.
తయారీ విధానం..
- ముందుగా పాన్లో నూనె వేడిచేసి వేరుశనగలు, పచ్చిశనగ పప్పు, మినపగుండ్లు వేయించాలి. అవి వేగాక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నువ్వులు వేసి సన్నటి మంటపై రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆపాలి. ఈ వేయించినవి చల్లార్చుకునేందుకు పక్కన తీయాలి.
- ఇదే పాన్లో కొద్దిగా నూనె వేసి టమోటా ముక్కలు, చింతపండు వేసి మగ్గనివ్వాలి. మూతపెట్టి, మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన కొత్తిమీర (2 కట్టలు) కూడా వేసి, టమోటాలు, కొత్తిమీర మగ్గి దగ్గరపడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని చల్లార్చాలి.
- అన్నీ చల్లారాక, వేయించిన పప్పు దినుసులు, మిర్చి, నువ్వులను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మగ్గబెట్టిన టమోటా, కొత్తిమీర మిశ్రమం, తగినంత ఉప్పు జతచేసి, రోట్లో దంచినట్లుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
- పచ్చడిని గిన్నెలోకి తీసుకోని, పెద్ద ముక్కలుగా కోసిన ఉల్లిపాయను కలిపి, కచ్చాపచ్చాగా స్మాష్ చేయాలి.
- చివరగా, తాలింపు వేసుకోవాలి. చిన్న కడాయిలో స్పూన్ నూనె వేడిచేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపపప్పు వేసి వేయించాలి.
- అవి చిటపటలాడాక కరివేపాకు, ఒక ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపాలి.
ఈ తాలింపును వెంటనే కొత్తిమీర పచ్చడిలో కలిపితే సరిపోతుంది.



































