అక్కడ ట్యాక్సీడ్రైవర్‌ కావాలంటే.. ఐఏఎస్ కన్నా ఎక్కువ చదవాలి!

సివిల్‌ సర్వీసెస్‌.. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఇందులో ఉత్తీర్ణులు కావాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాల్సిందే. సదరు అభ్యర్థులకు అన్ని విషయాలపై పరిజ్ఞానం ఉండాల్సిందే. కానీ, ఒక నగరంలో ట్యాక్సీ డ్రైవర్‌ అర్హత పరీక్షలో నెగ్గాలంటే కనీసం 25 వేల వీధులను, ల్యాండ్‌మార్క్‌లను గుర్తు పెట్టుకోవాలి. అయితే, కొన్ని నెలల్లో ఇది సాధ్యం కాదు. సంవత్సరాల తరబడి అధ్యయనం చేయాలి. డ్రైవింగ్‌లో చాకచక్యం ఉండాలి. ఇంతకీ ఆ నగరమేంటో తెలుసా..? బ్రిటన్‌ రాజధాని లండన్‌..!


పద్మవ్యూహం కన్నా ఎక్కువే..
లండన్‌ నగరం ఈ నాటిది కాదు. రోమన్‌ కాలం కన్నా ముందునుంచి మనుగడలో ఉంది. అప్పటి నుంచే మహానగరంగా రూపుదిద్దుకుంది. కాల ప్రవాహంలో వచ్చిన పాలకులు అనేక నిర్మాణాలను కొనసాగించారు. దీంతో నగరం నలు దిశలా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఆటోమొబైల్స్‌ వచ్చిన అనంతరం ట్యాక్సీలూ వచ్చాయి. అయితే, ఇంత మహానగరంలో దాదాపు 25 వేలకు పైగా వీధులు, ప్రాంతాలు ఉన్నాయి. దీంతో దాదాపు 160 ఏళ్ల కిందటే ఈ పరీక్ష విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ట్యాక్సీ డ్రైవర్‌ అర్హత పరీక్ష పాస్‌ కావాలంటే కనీసం మూడేళ్లు పట్టొచ్చు. ఈ పరీక్ష కూడా కఠినంగానే ఉంటుంది. మొత్తం నగరానికి సంబంధించిన ప్రాంతాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. వీటికి సమాధానమివ్వాలంటే మొత్తం లండన్‌ భౌగోళిక పరిస్థితుల గురించి చదవాల్సిందే.

వీరికి అల్జీమర్స్‌ రాదు..
గతేడాది ఈ నగర ట్యాక్సీ డ్రైవర్లపై అధ్యయనం నిర్వహించారు. వీరికి నగరం మొత్తం తెలిసివుండటంతో రోజూ ఏదో ప్రాంతానికి వెళ్లడం కారణంగా అపారమైన జ్ఞాపకశక్తి ఉంటుందని తేలింది. వీరి మెదడులోని ‘హిప్పోక్యాంపస్‌’ కాస్త పెద్దదిగా ఉంటుందట. ఈ హిప్పోక్యాంపస్‌ చిన్నపాటి జ్ఞాపకాలను సుదీర్ఘకాలం ఉంచుతుంది. సాధారణంగా వయసు మళ్లిన సమయంలో దీని పనితీరు మందగించడంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే, ఈ డ్రైవర్లకు మాత్రం అన్ని వేల వీధులు గుర్తుండటంతో ఈ వ్యాధి రావడం మాత్రం చాలా అరుదని ఆ అధ్యయనం గుర్తించింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.