Imran Khan: ఇమ్రాన్‌ హత్యకు నఖ్వీ కుట్ర: పాక్‌ మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) ఆరోగ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పలువురు క్రికెట్ దిగ్గజాలు పాక్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తోబుట్టువులు సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (CDF) ఆసిమ్‌ మునీర్‌, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తమ సోదరుడి హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. ఈ కుట్ర గురించి ఇటీవల ఇమ్రాన్‌ తమకు చెప్పారని పేర్కొన్నారు.


‘‘వారు నన్ను చంపుతారు. నన్ను చంపడానికి పథకం వేశారు’’ అని తమ సోదరుడితో జరిగిన సంభాషణను ఉజ్మా ఖాన్‌, అలీమాఖాన్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘మోసిన్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మా సోదరుడికి కానీ, మాకు కానీ ఏమైనా జరిగితే.. ఎవరినీ వదిలిపెట్టం’’ అని హెచ్చరించారు. జైలు గదిలో సుదీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచడంతో ఇమ్రాన్‌ కంటిచూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని పాక్ (Pakistan) సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఆయన కుడికన్ను చూపు 85% కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.