ఆ ఊరిలో.. చాడీలు చెబితే అంతే సంగతి!

ఒకరి గురించి ఇంకొకరికి ఉన్నవీ లేనివీ చెప్పడం అనవసర వివాదాలకు దారితీస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి గొడవలను నివారించేందుకు, ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మేఢకీ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. చాడీలు చెప్పడాన్ని నిషేధించారు. గాలి కబుర్ల వల్ల గ్రామంలో చిన్నచిన్న గొడవలే ముదిరి తీవ్రరూపం దాల్చుతుండటంతో నియంత్రణచర్యలు ప్రారంభించారు. అటువంటి వ్యక్తులపై రూ.5,000 జరిమానా కూడా విధించాలని నిర్ణయించారు.


‘‘కల్లబొల్లి మాటలతో ప్రజల మధ్య వివాదాలను రేకెత్తించాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. అటువంటివారిని కట్టడి చేసేందుకు.. చాడీలు చెప్పడాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని గ్రామ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే ఐదేళ్లుగా మద్యపాన నిషేధం అమలవుతోందని చెప్పారు. ‘‘మద్యం అమ్మితే రూ.10 వేలు, తాగి రచ్చ చేసినవారికి రూ.11 వేల జరిమానా విధిస్తున్నాం. మద్యం విక్రేతల గురించి సమాచారం అందించిన వారికి రూ.వెయ్యి రివార్డు ఇస్తున్నాం’’ అని వెల్లడించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.