అమెరికాను భయపెడుతున్న ఇరాన్‌ ‘దోమల దండు’..!

ప్రపంచ చమురు జీవనాడి హర్మూజ్‌పై ఉక్కు పిడికిలి బిగించేందుకు ఇరాన్‌ ఓ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. అయితే ఇది పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అమెరికా మూడు భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్‌ ప్రాంతానికి పంపినా.. అవి హర్మూజ్‌ వైపు వచ్చేందుకు తటపటాయిస్తున్నాయి. మరోవైపు ఐఆర్‌జీసీ మాత్రం అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని.. వాటికి తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది. అగ్రదేశాల రక్షణ వ్యవస్థలను అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్‌ దళాలు హర్మూజ్‌ వద్ద సిద్ధంగా ఉన్నాయి.


ఏమిటీ మస్కిటో ఫ్లీట్‌..?
ఇరాన్‌ చిన్నపాటి ఫాస్ట్‌ బోట్స్‌ ఇప్పటి వరకు యుద్ధంలో ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ సముద్ర దిగ్బంధ వ్యూహంలో ‘‘మస్కిటో ఫ్లీట్‌’’గా పిలిచే ఈ చిన్న పడవలదే కీలకపాత్ర. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్‌ బోట్స్‌ 1,500 వరకు ఇరాన్‌ ఐఆర్‌జీసీ నేవీ వద్ద ఉన్నాయి. టెహ్రాన్‌కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాకిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను ఆధునిక యాంటీ షిప్‌ మిసైల్‌ బోట్లతో సమ్మిళితం చేసి ఇరాన్‌ వాడుతోంది. ఇటువంటివి 300 వరకు ఉన్నట్లు అంచనా. నాసర్‌, కౌసర్‌ వంటి షార్ట్‌ రేంజి సూపర్‌ సోనిక్‌ గైడెడ్‌ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వీటితోపాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఘదెర్‌, జాఫర్‌, అబు మహదీ వంటి క్షిపణులున్నాయి. ఇక ఈ చిన్న బోట్లు స్మార్ట్‌మైన్స్‌ను పర్చడం వంటివి కూడా చేయగలవు.

ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్‌ వేగంతో ప్రయాణించగలవు. సముద్రంపై చురుగ్గా కదలగలవు. గుంపుగా ఈ చిన్నబోట్లు దాడి చేస్తే.. భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్‌ వ్యవస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. కొన్నాళ్ల క్రితం ఐఆర్‌జీసీ యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు హర్మూజ్‌లో పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. దీంతో అవి చిన్న బోట్ల దాడులకు ఎరగా మారే అవకాశాలు ఎక్కువ.

అన్‌మ్యాన్డ్‌ డ్రోన్ల బోట్లతో పెనుముప్పు..!
టెహ్రాన్‌ తయారు చేసిన చిన్నపాటి డ్రోన్‌ బోట్‌లు చమురు ట్యాంకర్లకు ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడుల్లో ఇవి పాల్గొన్నాయి. గతంలో ఉక్రెయిన్‌ కూడా ఇలాంటి బోట్లనే రష్యాపై వాడింది. ఇటీవల జనవరిలో ఐఆర్‌జీసీ విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్‌బోట్లు ఉన్నాయి. ఇరాన్‌ దళాలకు అనుబంధంగా పనిచేసే హూతీలు ఇప్పటికే డ్రోన్‌ బోట్లను వినియోగించారు. చిన్న ఫైబర్‌గ్లాస్‌ లేదా చెక్క పడవలను మానవ రహిత బోట్లుగా తీర్చిద్దారు. ఇప్పటికే కువైట్‌ వద్ద సోనాంగ్‌ నమిబే, ఇరాక్‌ సమీపంలో సేఫ్‌సీ విష్ణు, జెఫిరోస్‌ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు.

అజదార్‌ను అదుపు చేయడం కష్టం..
ఇక ఇరాన్‌ దళాల వద్ద అజదార్‌ అనే మానవ రహిత అండర్‌ వాటర్‌ వెహికల్‌ కూడా ఉంది. ఇది నాలుగు రోజులపాటు 600 కిలోమీటర్ల రేంజిలో గస్తీ కాయగలదు. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్‌ కిల్లర్‌గా వ్యవహరిస్తారు. అమెరికా నౌకలే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. వీటిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్‌ పన్నుతున్న ఈ వ్యూహాలు అమెరికా-ఇజ్రాయెల్‌ ఖర్చును గణనీయంగా పెంచడమే కాకుండా.. హర్మూజ్‌పై అవి పట్టు సాధించడం అసాధ్యమన్నట్లు పరిస్థితులను మార్చేశాయి.