PAN లేకపోయినా పర్వాలేదు! కొత్త రూల్స్ తో భారీ ఊరట!

చిన్న చిన్న అవసరాలకు కూడా పాన్ కార్డు అడుగుతున్నారని ఇబ్బంది పడే వారికి కేంద్రం తీపి కబురు అందించింది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, ఇళ్ల కొనుగోళ్లు, వాహనాల కొనుగోళ్లలో పరిమితులను పెంచడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు పెద్ద వెసులుబాటు కల్పించింది.


కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు-2026’ సామాన్య పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటనిచ్చేలా ఉన్నాయి. పాత కాలపు కఠిన నిబంధనలను పక్కనపెట్టి, మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పాన్ (PAN) కార్డు నిబంధనలను సరళతరం చేశారు. కొత్తగా రాబోతున్న ఆదాయపు పన్ను చట్టం-2025లో భాగంగా ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే..

1. PAN- బ్యాంకు లావాదేవీలు: రోజువారీ లెక్కలకు చెక్!
ఇప్పటివరకు బ్యాంకులో రోజుకు రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలంటే పాన్ తప్పనిసరి. కానీ కొత్త ముసాయిదా ప్రకారం ఇకపై రోజువారీ పరిమితి ఉండదు. ఏడాది మొత్తంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి రూ.10 లక్షల వరకు లావాదేవీలు (డిపాజిట్ లేదా విత్ డ్రాయల్) పాన్ లేకుండానే చేసుకోవచ్చు. అంత దాటితేనే పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి.

2. రియల్ ఎస్టేట్:
ఇల్లు, స్థలం కొనుగోలుదారులకు ఊరట కల్పించింది కేంద్రం. నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని రెట్టింపు చేశారు. ప్రస్తుతం రూ.10 లక్షలు దాటితే పాన్ అడుగుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రూ.20 లక్షల లోపు విలువ చేసే స్థలాలు, ఇళ్లు లేదా ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకు పాన్ సమర్పించాల్సిన అవసరం లేదు.

3. లగ్జరీ కార్లు, వాహనాల కొనుగోలు
ప్రస్తుతం టూ వీలర్స్ మినహా ఏ వాహనం కొనాలన్నా పాన్ ఉండాల్సిందే. కొత్త నిబంధనల ప్రకారం వాహనం ధర రూ.5 లక్షల లోపు ఉంటే (బైక్ అయినా, కార్ అయినా) పాన్ కార్డుతో పనిలేదు. మధ్యతరగతి వారు కొనే చిన్న కార్లు, స్కూటర్లకు ఇది పెద్ద వెసులుబాటు.

4. హోటల్ బిల్లులు & ఫంక్షన్ల ఖర్చులు
పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకల సమయంలో భారీ బిల్లులు చెల్లించే వారికి ఇది ఊరట. హోటల్ బిల్లులు, రెస్టరెంట్ ఖర్చులు లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే చెల్లింపుల పరిమితిని రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు.

5. ఇన్సూరెన్స్ రంగంలో మాత్రం కఠినం!
మిగతా చోట్ల వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం, బీమా విషయంలో మాత్రం పారదర్శకత కోసం నిబంధనలు కఠినతరం చేసింది. ఇకపై మీరు ఏ పాలసీ తీసుకోవాలన్నా (లైఫ్, హెల్త్ లేదా జనరల్ ఇన్సూరెన్స్), ప్రీమియం ఎంత అన్న దానితో సంబంధం లేకుండా పాన్ కార్డు తప్పనిసరి. బీమా క్లెయిమ్‌ల సమయంలో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి:
తుది నోటిఫికేషన్: మార్చి 2026 మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది.
అమలు: ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.

 

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.