Journalist Rajinikanth : జర్నలిస్ట్ రజనీకాంత్ అంత సంపాదించాడా? ఐటీ శాఖ నోటీసులతో టీవీ9కు ‘సెలవు’?

www.mannamweb.com


Journalist Rajinikanth : టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సంపాదన అందనంత రేంజ్ లో ఉందా? ఆయన ఆదాయానికి, సమకూర్చిన ఆస్తులకు, చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు పొంతన లేదా?

అందువల్లే రజనీకాంత్ ఐటీ అధికారులకు చిక్కాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తోంది. అదనపు ఆదాయం, సంపాదించిన ఆస్తులపై వివరాలు ఇవ్వాలని రజనీకాంత్ కు ఆదాయపు పన్ను శాఖ తాఖీదులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.. టీవీ9 లో చర్చలు పెట్టకుండా, సెలవుపై వెళ్లాలని యాజమాన్యం ఆదేశించిన తర్వాత, ఈ వ్యవహారం మీడియా సర్కిళ్లల్లో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

టీవీ9 ఛానల్ ను ఏర్పాటు చేసింది రవి ప్రకాష్ అయినప్పటికీ.. కొత్త యాజమాన్యం బలవంతంగా ఆయనను బయటికి పంపింది. ఆ తర్వాత ఆయన స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు. అంతకుముందు రజనీకాంత్ టీవీ9 లో ఉన్నప్పటికీ.. తక్కువగా ఫోకస్ అయ్యాడు. ఎప్పుడో ఒకసారి రవి ప్రకాశ్ అనంతరం ప్రైమ్ టైం లో కనిపించేవాడు. కానీ ఎప్పుడైతే రవి ప్రకాష్ బయటకు వెళ్లిపోయాడో.. ఆ స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు. అప్పటి నుంచి రజనీకాంత్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం, హైదరాబాదులో ఔషధ తయారీ సంస్థల్లో వాటాలు, ఏపీలో వైసిపి కి చెందిన కొంతమంది నాయకులతో కలిసి సాగిస్తున్న వ్యాపారాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో రజనీకాంత్ నిర్వహిస్తున్నారని భోగట్టా.. ఇదే సమయంలో రజినీకాంత్ అత్యంత విలువైన ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరు మీద క్రయం చేసుకున్నారని తెలుస్తోంది.

ఎప్పటినుంచో రజనీకాంత్ వ్యవహార శైలి పై దృష్టి సారించిన ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం మీడియా వర్గాల్లో సంచలనానికి దారి తీస్తోంది. ఈ విషయం ఈ నోటా, ఆ నోటా పడి, తెగ చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ వ్యవహార శైలి తెలుసుకున్నవారు..వామ్మో ఆయన ఈ స్థాయిలో ధనవంతుడా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవలి ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసిపి ఓడిపోవడంతో రజనీకాంత్ తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. దీనిని మర్చిపోకముందే ఐటీ శాఖ రూపంలో నోటీసులు రావడం ఆయనను వేదనకు గురి చేస్తోందని తెలుస్తోంది. మరి ఈ విషయం టీవీ9 యాజమాన్యానికి తెలియడంవల్లే టీవీ స్క్రీన్ మీదకి రావద్దు అన్నట్టుగా ఆదేశాలు వెలువడ్డాయట. ఆయన ఇప్పట్లో స్క్రీన్ మీదకు వచ్చే అవకాశాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి వీటిల్లో ఎంత నిజం ఉందో, మరెంత అబద్ధం ఉందో రజనీకాంత్ నోరు విప్పేంతవరకు తెలియదు.