JrNTR Fans : హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లేక్సీల తొలగింపు వివాదానికి దారి తీసింది. బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తీసేసారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాట్‌కి వచ్చి వెళ్లిన వెంటనే సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించడం విమర్శలకు దారి తీసింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఘాట్ బయట కొద్దిసేపు ఆందోళన చేశారు.
ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భాల్లో ఘాట్ చుట్టుపక్కల అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించామని సిబ్బంది చెప్పడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అయితే ఈ ఘటనపై బాలకృష్ణ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ స్పందించలేదు. ఏపీలో ఇలాంటి సంఘటనలో ఒకటి రెండు చోట్ల జరిగినా హైదరాబాద్‌లో మొదటిసారి ఇలా జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొంతకాలంగా నారా కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆదేశాలు ఇచ్చారా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.