రీల్స్‌ చూసి చిరునామా కనుక్కున్నాడు..వనస్థలిపురంలో సునీత హత్యోదంతంలో కీలక విషయాలు వెలుగులోకి…

తనతోపాటు కుటుంబ సభ్యులపై గృహహింస కేసు పెట్టిందనే కక్ష, మరొకర్ని వివాహం చేసుకుందనే అసూయతో మాజీ భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంపేందుకు కత్తితోపాటు విద్యుత్‌ రంపం తెచ్చుకుని… పక్కా ప్రణాళికతో హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన రీల్స్‌లో కనిపించిన ఆలయం ఆధారంగా ఆమె ఉంటున్న ప్రాంతాన్ని కనిపెట్టి దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌ వనస్థలిపురంలో బుధవారం జరిగిన గర్భిణి హత్యోదంతంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం…


ప్రేమ..పెళ్లి..కేసులు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన దేవరకొండ మహేశ్‌ 2019-22 వరకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసి, కెనడా వెళ్లాడు. మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లా బల్లార్పూర్‌ మండలం తిలక్‌వాడ్‌కి చెందిన సునీత(30)తో… అతనికి 2014 నుంచి పరిచయముంది. మహేశ్‌ సొంతూరు, సునీత అమ్మమ్మ గ్రామం ఒక్కటే కావడంతో ఇద్దరి మధ్య పరిచయం..ప్రేమగా మారింది. 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. సునీతకు వీసా రాకపోవడంతో మహేశ్‌ ఒక్కడే కెనడా వెళ్లాడు. అక్కడికెళ్లాక ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంగా గొడవలు జరుగుతున్న సమయంలోనే సునీత 2023 అక్టోబరులో కెనడా వెళ్లింది. గొడవలు మరింత పెరగడంతో కొన్ని నెలలకే స్వదేశానికి తిరిగొచ్చిన సునీత… మహారాష్ట్రలోని బల్లార్పూర్‌ ఠాణాలో భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసులో మహేశ్, అతని తల్లిదండ్రులు నిందితులుగా ఉన్నారు.

ఆలయం పేరు ఆధారంతో గాలిస్తూ…
తల్లి మరణం, లుక్‌ఔట్‌ నోటీసుల కారణంగా వీసా నిరాకరణకు గురవడం తదితర పరిణామాలకు సునీత కారణమని భావించిన మహేశ్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన రీల్స్‌ చూసి గతేడాది ఏప్రిల్‌లో ఆమె మరొకర్ని వివాహం చేసుకున్నట్లు తెలుసుకుని మరింత రగిలిపోయాడు. ఇటీవల ఓ గుడి వద్ద ఉన్న ఫొటోను ఆమె అప్‌లోడ్‌ చేయడంతో ఆలయం వనస్థలిపురంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. వనస్థలిపురంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. చివరకు గ్రీన్‌సిటీ కాలనీలో సునీత ఉంటున్న అపార్టుమెంటును కనిపెట్టాడు. మూడు రోజుల క్రితం రెక్కీ నిర్వహించి..బుధవారం మధ్యాహ్నం నేరుగా ఇంట్లో చొరబడి ఆమెను అంతమొందించాడు.

ఎవరైనా అడ్డుకుంటే…
నిందితుడి వద్ద ఉన్న సంచిలో పెద్ద కత్తి, రెండు విద్యుత్‌ రంపాలు, పెట్రోలు డబ్బా ఉన్నట్లు గుర్తించారు. అవెందుకని ప్రశ్నించగా.. ‘సునీత నన్ను చూశాక భయపడి తలుపులు వేసుకుంటే… వాటిని కోసైనా లోపలికి వెళ్లాలనే ఉద్దేశంతో రంపాలను తెచ్చుకున్నా. ఇతరులెవరైనా అడ్డగిస్తే..వారిని బెదిరించేందుకు పెట్రోలు తెచ్చుకున్నా’’ అని నిందితుడు చెప్పినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించామని ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ, ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌ గురువారం తెలిపారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.