ఆంధ్రప్రదేశ్లోని ఆ ఊరు క్రమంగా సముద్రంలో మునిగిపోతోంది. ఇప్పటికే వందలాది ఇళ్లు సముద్రంలో మునిగాయి. ఫలితంగా వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు.
ఆ ఊరి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట గ్రామం జనాభా దాదాపు 4వేలు.
ఈ ఊరిలోని భూభాగం ఏటా సముద్ర జలాల ఆటుపోట్ల వల్ల తీవ్ర కోతకు గురవుతోంది.
గత రెండేళ్ల వ్యవధిలో ఈ ఊరి(Konapapapeta)లోని భూభాగం దాదాపు 50 మీటర్ల మేర సముద్రంలో కలిసిపోయింది. అంటే అంతమేర సముద్రం ముందుకు కదిలి వచ్చింది.
ఊరిలోని భూభాగం సముద్రంలో కలిసిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గత రెండు నెలల్లో పలు తుఫానుల వల్ల కోనపాపపేట గ్రామంలోని కొంత తీర ప్రాంతం సముద్రంలో మునిగింది. చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి.
తాజాగా మంగళవారం రాత్రి సముద్రంలో కెరటాలు భీకర స్థాయిలో ఎగిసిపడటంతో ఆ గాలుల ధాటికి తీరంలోని పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
ఈ ఊరిలోని మెయిన్ రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు దాదాపు 200 మీటర్ల పరిధిలో ఆరు వరుసల్లో మత్స్యకారుల ఇళ్లు ఉండేవి. ఆ ఇళ్లలో దాదాపు 600 మంది నివసించేవారు.
సముద్ర కోత వల్ల నాలుగు వరుసలలోని దాదాపు 100 ఇళ్లు మాయమయ్యాయి. దాదాపు 400 మంది నిలువనీడ కోల్పోయారు.
ప్రస్తుతం కోనపాపపేటలో రెండు వరుసల్లో 50 ఇళ్లే మిగిలాయి. వాటిలోని కుటుంబాల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
సముద్రపు జలాల కోత నుంచి కోనపాపపేటను రక్షించేందుకుగానూ వాకలపూడి నుంచి అమీనాబాదు వరకు రక్షణ గోడను నిర్మిస్తామని టీడీపీ సర్కారు చెబుతోంది. ఆ పనులను సాధ్యమైనంత త్వరగా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తమ కుటుంబాలు నిలువ నీడ కోల్పోకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నారు.