యుద్ధం నుంచి వైదొలుగుదాం: ట్రంప్‌నకు సహాయకుల విజ్ఞప్తి..?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌ యుద్ధం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు బహిరంగంగా ప్రకటించాలని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆయన సలహాదారులు కోరుతున్నట్లు అందులో వెల్లడించింది. యూఎస్‌ అధికారిక వర్గాల నుంచి ఈ సమాచారం వచ్చినట్లు తెలిపింది.


వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ఇరాన్‌ అణు వ్యవస్థలను నాశనం చేయాలన్న అమెరికా లక్ష్యం నెరవేరిందని.. ఆ దేశంపై యుద్ధంలో తాము అనుకున్న వాటికంటే ఎక్కువ లక్ష్యాలనే అమెరికా సైన్యం సాధించిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు యుద్ధం నుంచి వైదొలిగినా ఎటువంటి నష్టం లేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు, సుదీర్ఘ యుద్ధాల వల్ల సొంత ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందువల్ల యుద్ధం నుంచి వైదొలిగితేనే మంచిదని ట్రంప్‌నకు సూచించారు.

కాగా ఈ కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ తోసిపుచ్చారు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్‌నకు ఎవరూ ఎటువంటి సలహాలు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఈ విషయంపై వస్తున్న కథనాల్లో నిజం లేదన్నారు. ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంలో విజయం సాధించడానికి ట్రంప్‌ పాలకవర్గంలోని అగ్ర సహాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ట్రంప్‌ తన పోరాటాన్ని ఆపరని అన్నారు. ఒకవేళ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని కమాండర్ ఇన్ చీఫ్ బహిరంగంగా ప్రకటిస్తారని అన్నారు.