ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం

www.mannamweb.com


ఎవరి నేరమిది.. ఎంతటి పాపమిది?

వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట

ఆరుగురి మృతి.. పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు

కనీస ఏర్పాట్లు చేయకుండానే తరలి రమ్మంటూ టీటీడీ పిలుపు

తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులు

రాత్రి 8.35 గంటలకు ఒక్కసారిగా గేట్లు ఓపెన్‌.. దూసుకెళ్లిన భక్తజనం

క్యూలైన్ల నిర్వహణలో చేతులెత్తేసిన అధికారులు.. అడుగడుగునా నిర్లక్ష్యం

ఫలితంగా తోపులాట.. నలిగిపోయిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు

రుయా, స్విమ్స్‌ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు

భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్న వైద్యులు

గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాతి్మక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.

గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల-తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది.

చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల-తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు.

రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల-తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది.

ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమే
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్‌పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు.

వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాట
అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్‌ చేశారు. క్యూ లైన్‌లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

టీటీడీ వైఫల్యం..
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు.

తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.

ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే
2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్‌ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు.

దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది.

రామానాయుడు స్కూల్‌లో దారుణం
అక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమం
తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.

ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్‌ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.

నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..
తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.

నాడు
2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్‌ దగ్గర సింగిల్‌ లైన్‌ క్యూలు ఏర్పాటుచేశారు.

కౌంటర్‌ వద్ద ఒకే వ్యక్తి టోకెన్‌ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్‌ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్‌ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.

నేడు..
వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్‌ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

చనిపోయిన వారు వీరే..
లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం
శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం
రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం
మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు
బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట
నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తిరుపతి ఘటనపై సీఎం రేవంత్‌ విచారం
సాక్షి, హైదరాబాద్‌: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

ఎప్పుడేం జరిగిందంటే..
8వ తేదీ బుధవారం ఉ.5 గంటలకు..
⇒ తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభం
⇒ ఉ.7.30కు 60 శాతం భక్తులతో నిండిన క్యూలైన్లు
⇒ ఉ.8.30కు క్యూలైన్ల వద్దకు చేరుకున్న పోలీసులు
⇒ ఉ.9.30కు పూర్తిస్థాయిలో క్యూలైన్లు నిండి ప్రవేశద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన భక్తులు
⇒ ఉ.10.30కు టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్లిపోయారు.
⇒ ఉ.11.30కు భక్తులు టాయిలెట్స్‌ కోసం, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు.
⇒ మ.12.30కు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేరుకున్న భక్తులు
⇒ మ.1.30కు భక్తుల తాకిడి తారాస్థాయికి చేరుకుంది.
⇒ మ.2.30 అవుతున్నా కౌంటర్‌ కేంద్రాల వద్ద భక్తులను అప్రమత్తం చేయని అధికారులు
⇒ మ.3.30కు క్యూలైన్‌లో వేచి ఉండలేక.. టికెట్లు ఎప్పుడిస్తారంటూ భక్తుల నిలదీత.. ప్రశ్నించినా పట్టించుకోని అధికారులు
⇒ సా.4.30కు శ్రీనివాసం, బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్స్‌ వద్ద రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని ప్రకటన
⇒ సా.5.30కు రైల్వేస్టేషన్, బస్టాండ్‌ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్‌ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్‌ వద్దకు చేరిక.
⇒ సా.6.30కు కౌంటర్‌ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండడంతో టోకెట్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం.
⇒ రాత్రి 7.30 గంటలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసం కౌంటర్‌ వద్ద తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళా క్యూలైన్‌లో కిందపడిపోయింది.
⇒ రాత్రి 7.45కు కిందపడిన మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.
⇒ రాత్రి 8 గంటలకు మరో పదిమందిæ భక్తులు కింది పడిపోయారు. వారంతా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా, స్విమ్స్‌ అస్పత్రులకు తరలించే ప్రయత్నాలు చేశారు.
⇒ రాత్రి 8.30కు స్పృహ కోల్పోయిన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గంమధ్యలోనే మృతిచెందింది. అదే సమయంలో బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్‌ వద్ద తోపులాటలో 40 మంది కిందపడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు.
⇒ రాత్రి 9.10కు కిందిపడిపోయిన భక్తులను రుయా అస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గుర్తించారు.
⇒ 9.20కు అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా టోకెన్ల జారీని కొనసాగించే పనిలో పడ్డారు.