ముగిసిన మహానాడు: కడపలో ఇదే గ్రౌండ్ రిపోర్ట్

తెలుగు దేశం పార్టీ మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన ‘మహానాడు’ ముగిసింది. కడప జిల్లాలో ఈసారి ‘మహానాడు’ని టీడీపీ నిర్వహించిన విషయం విదితమే.


రాయలసీమలో అంచనాలకు మించి 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో, టీడీపీ ఈ ఏడాది ‘మహానాడు’ పండుగను కడపలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుని, అంగరంగ వైభవంగా ‘మహానాడు’ని నిర్వహించగలిగింది.

అధికార పార్టీ గనుక, టీడీపీకి ‘మహానాడు’ నిర్వహణ పరంగా పెద్దగా ఇబ్బందులేమీ కలగలేదు. ఊరూవాడా పసుపుమయం అయ్యింది.. టీడీపీ జెండాలతో. రాయలసీమలో, అందునా కడపలో, టీడీపీకి గతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వుండేవి. టీడీపీ జెండా పట్టుకోవడానికే కార్యకర్తలు భయపడిన పరిస్థితులూ వుండేవి.

కానీ, ఎప్పుడైతే, 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలయ్యిందో, కడపలో రాజకీయం క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ‘మహానాడు’ నిర్వహణతో, కడపలో టీడీపీకి పాపులారిటీ మరింత పెరిగిందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది.

‘ఊళ్ళలోకీ టీడీపీ చొచ్చుకెళ్ళగలిగింది.. వైసీపీకి వున్న పట్టు తగ్గకపోయినా, టీడీపీ మాత్రం తన ఉనికిని ఇకపై మరింత బలంగా చాటుకునేందుకు ఆస్కారం ఏర్పడింది..’ అన్న అభిప్రాయాలు వైసీపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లో టీడీపీ గురించి వినిపిస్తుండడం గమనార్హం.

‘ముందు ముందు ఉమ్మడి కడప జిల్లాలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్ని గెలుచుకునేలా మన వ్యూహం వుంటుంది..’ అంటూ పార్టీ శ్రేణులకు మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, మహానాడు సందర్భంగా టీడీపీ జెండాల విషయమై టీడీపీ – వైసీపీ మధ్య జరిగిన గలాటా కూడా, టీడీపీకి అడ్వాంటేజ్‌గా మారింది. అదే సమయంలో వైసీపీ శ్రేణులు, కడపలో తమ పట్టుని కోల్పోతామా.? అన్న ఆందోళనకు గురవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.