ICMR బృందంతో భేటీ.. బర్డ్ ప్లూపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

పల్నాడు జిల్లా(Palnadu District) నరసరావుపేట నియోజకవర్గం(Narasaraopet Constituency)లో బర్డ్ ఫ్లూ(Bird flu)తో 2 ఏళ్ల చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే.


అయితే బాలిక మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని, చికెన్ తినడం వల్లే వ్యాధి సోకుతోందనే ప్రచారం, ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ICMR చనిపోయిన బాలిక నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయించింది. దీంతో బాలిక బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఉడకని కోడి మాంసం తినడంతోనే బర్డ్ ఫ్లూ సోకిందని, ఐదేళ్లలో దేశంలో నాలుగు హెచ్5ఎన్1, హెచ్9ఎన్2 కేసులు నమోదు అయినట్లు గుర్తించింది.

అయితే బాలిక మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించాలని ఐసీఆర్ బృందం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి నరసరావుపేటకు వెళ్లిన బృందం… స్థానికుల ఆహారపు అలవాట్లు, పరిస్థితులు, పరిసరాలతో పాటు చిన్నారి మృతి కారణాలపై అధ్యయనం చేసింది. ఈ మేరకు నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఐసీఎమ్ఆర్ బృందంతో పాటు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. బాలిక మృతి కారణాలను చంద్రబాబుకు ఐసీఎమ్‌ఆర్ ప్రతినిధులు (ICMR Team) వివరించారు. వ్యాధి నిరోధక శక్తి లేమి, అపరిశుభ్ర పరిసరాలు, లెప్టోస్పిరోసిస్ కారణమని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ప్రస్తుతం నరసరావుపేట పరిసరాల్లో బర్డ్ ఫ్లూ లేదని వెల్లడించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్థానికుల నమూనాలను కూడా పరీక్షించామని, ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని పేర్కొన్నారు.

దీంతో ఐసీఎమ్ఆర్ చెప్పిన ప్రకారం బర్డ్‌ఫ్లూ పట్ల ఆందోళన అవసరంలేదని వైద్యశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు యాంటీ వైరల్ డ్రగ్స్‌ను సిద్ధం చేశామని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.