భారాస (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ పీఎస్‌లో విధుకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.
దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని అరెస్ట్ చేశారు. ఆయన్ను అక్కడి నుంచి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.
అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు(Harish Rao), జగదీశ్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భారాస కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీశ్‌ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన భారాస నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు..
కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్‌ఎస్ 57, 126(2), 127(2), 132, 224, 333, 451(3), 191(2), r/w 190, r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను కోర్టుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్ వద్దకు కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు చేరుకున్నారు. వారిని లోపలికి అనుమతించలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.