రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ ఆధ్వర్యాన భారీ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) – ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఒప్పందం జరిగింది.
రాష్ట్రానికి భారీ లబ్ది
ఈ ఒప్పందం అమలులోకి రావడం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ. 1,87,000 కోట్ల పెట్టుబడి ఎన్జీఈఎల్ పెట్టనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే రానున్న 25 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.20,620 కోట్ల లబ్ది రాష్ట్రానికి వివిధ రూపాల్లో చేకూరనుంది.
పునరుత్పాదక విద్యుత్ రంగానిదే భవిష్యత్ : ముఖ్యమంత్రి
ఈ ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి చేసే క్రమంలో కీలక అడుగు అన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తి చెయ్యాలని సిఎం తెలిపారు. కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో ఎంతో నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని అన్నారు.
ప్రాజెక్టుల రాకతో ప్రాంతాల అభివృద్ధి
ఎన్జీఈఎల్ – ఎన్ఆర్ఈడీసీఏపీ సంయుక్త భాగస్వామ్యంతో 25 గిగావాట్ల సామర్ధ్యం వున్న సౌర, పవన, హైబ్రిడ్ సిస్టమ్ల ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి ఉత్పన్నాలను తగిన పద్ధతుల ద్వారా 0.5 MMTPA(మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. అదనంగా, రాష్ట్రంలోని అనువైన ప్రదేశాలలో 10 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ జాయింట్ వెంచర్తో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రావడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల రూపురేఖలు మారతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఒప్పందం కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎన్టీపీసి గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్ కో, జెన్ కో అధికారులు ఉన్నారు