అరెరే.. ఉక్రెయిన్‌ మాట వినాల్సింది..! ఇప్పుడు తల పట్టుకుంటున్న ట్రంప్‌

దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఓ అరుదైన సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్‌ ముందుకొచ్చింది. కానీ, కీవ్‌ సామర్థ్యాన్ని సందేహించిన ట్రంప్‌ సర్కార్‌ ‘ఆ.. మాకొద్దులే’ అంటూ పెదవి విరిచింది. ఇప్పుడు ఆ తిరస్కరణే ఏకు మేకై కూర్చోవడంతో అగ్రరాజ్యం తల పట్టుకోవాల్సి వచ్చింది. చేసేదేం లేక.. ఇరాన్‌ చౌక డ్రోన్ల (Iran Shahed drones)కు విరుగుడు కోసం మళ్లీ ఉక్రెయిన్‌ను సంప్రదిస్తోంది..!


స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినా..
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతల్లో ఇరాన్‌ షాహెద్‌ డ్రోన్లు అమెరికా (USA), ఇజ్రాయెల్‌ను తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీటిని తిప్పికొట్టే సాంకేతికతను ఉక్రెయిన్‌ (Ukraine) ఎన్నడో అభివృద్ధి చేసింది. ఆ ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లను అమెరికాకు అందిస్తామంటూ కొన్ని నెలల కిందట ఉక్రెయిన్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా యాక్సియోస్‌ సంచలన కథనం ప్రచురించింది. గతేడాది ఆగస్టులో వైట్‌హౌస్‌లో ట్రంప్‌ (Donald Trump)తో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) స్వయంగా ఈ ప్రతిపాదనను ముందుంచారట. ఇరాన్‌ డ్రోన్ల వల్ల పశ్చిమాసియాలోనూ అమెరికా స్థావరాలకు పొంచి ఉన్న ముప్పు గురించి నాడు ఆయన అమెరికా అధ్యక్షుడికి వివరించినట్లు సమాచారం.

ఆ తర్వాత ఈ సాంకేతికత గురించి అమెరికా దళాలకు కీవ్‌ వివరణాత్మక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చింది. ఇరాన్‌ డ్రోన్లను ఎదుర్కొనేందుకు తుర్కియే, జోర్డాన్‌, పర్షియన్ గల్ఫ్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కాంబాట్‌ హబ్‌లను ఏర్పాటుచేస్తామని నాడు ఉక్రెయిన్‌ ప్రతిపాదించింది. జెలెన్‌స్కీతో సమావేశం సమయంలో దీనిపై తన బృందం పనిచేస్తుందని ట్రంప్‌ చెప్పారట. కానీ, ఆ తర్వాత వారి నుంచి ఏ స్పందన లేదని కీవ్‌ అధికారులు వెల్లడించారు.

‘‘బహుశా జెలెన్‌స్కీపై ఒకింత అనుమానంతో ఈ ఆఫర్‌ను తిరస్కరించి ఉంటారు. అయితే, ఇరాన్‌తో యుద్ధం విషయంలో మేం చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏదైనా ఉందా అంటే.. అది ఉక్రెయిన్‌ సాంకేతికతను తీసుకోకపోవడమే’’ అని అమెరికా అధికారి ఒకరు ధ్రువీకరించినట్లు యాక్సియోస్‌ తమ కథనంలో వెల్లడించింది. ఈ విషయంలో నాడు అమెరికా లెక్క తప్పడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో భారీగా నష్టపోవాల్సి వస్తోందని రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆ ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్‌ టెక్నాలజీ కోసం గతవారం అమెరికా అధికారికంగా ఉక్రెయిన్‌ను సంప్రదించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ఇటీవల జెలెన్‌స్కీ కూడా దీనిపై స్పందిస్తూ.. అగ్రరాజ్యం కోరితే ఆ సాంకేతికతను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రష్యా దెబ్బకు కీవ్‌ ఐడియా..
ఇరాన్‌ ప్రస్తుతం వినియోగిస్తోన్న షాహెద్‌ డ్రోన్లకు సంబంధించిన విడి భాగాలను రష్యా ఇప్పటికే కొనుగోలు చేసింది. వాటిని తమ దేశంలో అసెంబుల్‌ చేసి గెరాన్‌-2 పేరుతో ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తోంది. దీంతో వీటిని అడ్డుకోవడం కోసం కీవ్‌ సొంతంగా ఈ ఇంటర్‌సెప్టర్‌లను అభివృద్ధి చేసింది. సెన్సర్లు, ఇతర ఎయిర్‌ డిఫెన్స్‌ టూల్స్‌తో అనుసంధానించి డిజైన్‌ చేసింది. దీనికి వార్‌ హెడ్‌ తగిలించి ప్రయోగించవచ్చు. చిన్న బ్యాగులో పెట్టి తీసుకెళ్లే సౌలభ్యముంది. వీటికి నైట్‌ విజన్ పరికరాలను కూడా అమర్చడంతో రాత్రిళ్లు సైతం దూసుకొచ్చే డ్రోన్లను అడ్డుకుంటున్నాయి.

ఏంటీ షాహెద్‌ డ్రోన్లు..
షాహెద్‌-136 వన్‌వే అటాక్‌ డ్రోన్లు. ఇవి చిన్న క్రూయిజ్‌ మిస్సైళ్లలా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని ఆత్మాహుతి డ్రోన్లుగా పోలుస్తారు. ఒక్కో దాని తయారీకి అయ్యే ఖర్చు సుమారు 20 వేల డాలర్లు (రూ.16 లక్షలు). ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా పేట్రియాట్‌ వంటి ఖరీదైన క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది. వీటి ధర రూ.కోట్లల్లో ఉండటంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తోన్న వేళ.. ఉక్రెయిన్‌ సాంకేతికత అమెరికా రక్షణ వ్యవస్థపై కాస్త భారం తగ్గించే అవకాశం ఉంది.