హర్మూజ్‌ మూతపడితే చమురు ధరలకు రెక్కలు: ఐరాస

=పశ్చిమాసియా ఘర్షణలతో హర్మూజ్ జలసంధి మూతపడితే..ప్రపంచవాణిజ్యం, అభివృద్ధిపై పెను ప్రభావం ఉంటుందని ఐక్యరాజ్య సమితి (United Nations) హెచ్చరించింది. దానివల్ల ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈమేరకు ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌సీటీఏడీ తన నివేదికలో పేర్కొంది.


అమెరికా-ఇజ్రాయెల్‌ (USA-Israel) దాడులు, ఇరాన్ (Iran) ప్రతిదాడులతో ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ‘‘సైనిక ఘర్షణల ప్రభావాలు పశ్చిమాసియాకే పరిమితం కావు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర రవాణా, అంతర్జాతీయ సరఫరా గొలుసులపైనా ప్రభావం పడుతుంది. ఇంధనం, ఎరువుల ధరలతో పాటు రవాణా ఛార్జీలు, బీమా ప్రీమియంలు పెరిగిపోతే.. ఆహార ధరలు, జీవన వ్యయాలకు రెక్కలొస్తాయి. ఈ పరిణామాల వల్ల ప్రత్యేకించి పేదవర్గాల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది’’ అని ఐరాస హెచ్చరించింది. ఇప్పటికే పలు దేశాలు పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.