డార్క్‌మోడ్‌లోకి చమురు నౌక.. హర్మూజ్‌లో డేరింగ్‌ జర్నీ చేసి భారత్‌కు..!

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో జలసంధిని సురక్షితంగా దాటి, ముంబయి పోర్ట్‌కు చేరుకున్న తొలినౌక ఇదే (Crude Oil Tanker). దీనిని నడిపిన కెప్టెన్ కూడా ఇండియనే. అసలు ఆ షిప్‌ గమ్యస్థానానికి ఎలా చేరిందంటే..?


లైబీరియా జెండాతో ఉన్న షెన్‌లాంగ్‌ సూయెజ్‌మాక్స్‌ చమురు ట్యాంకర్ బుధవారం ముంబయి నౌకాశ్రయానికి చేరుకుంది. మూడురోజుల క్రితమే అది హర్మూజ్‌ (Strait Of Hormuz)ను దాటింది. తన ప్రయాణాన్ని ఎవరూ ట్రాక్ చేయకుండా చురుగ్గా వ్యవహరించింది. మార్చి ఒకటిన ఈ ట్యాంకర్ సౌదీ అరేబియా పోర్ట్ వద్ద చమురు లోడ్ చేసుకుంది. మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దాని సిగ్నల్స్ మార్చి 8న హర్మూజ్‌లో కనిపించాయి. ఆ తర్వాత అది జాడలేకుండా పోయింది. నౌకలోని సిబ్బంది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్ (AIS), ట్రాన్స్‌పాండర్లను స్విచ్ఛాఫ్ చేశారని తెలుస్తోంది.
చీకటిలోకి వెళ్లిపోయి..
ప్రస్తుతం అడుగడుగునా ప్రమాదకరంగా మారిన హర్మూజ్‌లో గుర్తింపు తెలియకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. జలసంధిని దాటి ఇండియా దిశగా ప్రయాణిస్తున్నప్పుడు.. అంటే ఒకరోజు తర్వాత మళ్లీ ట్రాకింగ్ సిస్టమ్స్‌లో ఈ షిప్ కనిపించింది. సంక్షోభ సమయాల్లో ప్రత్యర్థులకు చిక్కకుండా ఉండేందుకు అసాధారణ పరిస్థితుల్లో షిప్పింగ్ కంపెనీలు ఈ టెక్నిక్‌ను వాడుతుంటాయి. దీనిని గోయింగ్ డార్క్‌ (going dark)గా చెప్తుంటారు. అంతర్జాతీయ సముద్రయాన నిబంధనల ప్రకారం.. భద్రత, రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఏఐఎస్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంచాలి.

ఇక, ఇప్పుడు ముంబయి (Mumbai)కు షెన్‌లాంగ్.. 1,35,335 మెట్రిక్‌ టన్నుల చమురును మోసుకొచ్చింది. గ్రీస్‌లోని డైనకామ్‌ ట్యాంకర్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈ నౌక కార్యకలాపాలు చూస్తోంది. 29 మంది సిబ్బందిలో భారతీయులతో సహా పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ జాతీయులు ఉన్నారు. కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సింధు భారతీయుడే. హర్మూజ్ అంతరాయాలతో భారత్‌లో ఇంధన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో షెన్‌లాంగ్ విజయవంతంగా దేశానికి చేరడం, మరోవైపు భారత పతాక నౌకలు హర్మూజ్‌నుంచి వెళ్లొచ్చని ఇరాన్ (Iran) అనుమతిచ్చినట్లు వార్తలు రావడం ఊరటనిస్తోంది.