కుబేరుల నగరంలో కార్చిచ్చు.. వేల సంపన్నగృహాలు అగ్నికి ఆహుతి

www.mannamweb.com


అమెరికాలో కుబేరులకు ఆవాసాలైన మూడు నగరాల్లో లాస్‌ ఏంజెలెస్‌ ఒకటి. ఇప్పుడు ఆ సిటీలోని అత్యంత ఖరీదైన ప్రదేశాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇక్కడ సంపన్నవర్గాలు నివసించే ది పాలిసాడ్స్‌ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. దీంతో 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలామంది తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలివెళ్లారు.

వీధుల్లో పొగ కమ్మేసింది. మరోవైపు ఒక్కసారిగా ప్రజలు రోడ్ల పైకి రావడంతో చాలాచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు ఇరుగ్గా ఉంటాయి. దీనికితోడు గాలులు ఎక్కువగా వీయడంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ స్పందిస్తూ.. ‘‘చాలా నిర్మాణాలు కాలిపోయాయి. మరికొన్నిచోట్ల కూడా కార్చిచ్చులు పుట్టొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు’’ అని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పున్నట్లు లాస్‌ ఏంజెలెస్‌ అగ్నిమాక అధికారి క్రిస్టీన్‌ క్రావ్లీ చెప్పారు.

బెవర్లీ హిల్స్‌, హాలీవుడ్‌ హిల్స్‌, మలిబు, శాన్‌ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి ఫైర్‌ అలర్ట్‌ లెవల్స్‌ను పెంచారు. దాదాపు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా విద్యుత్తు లేక ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు.

ఇళ్లు కోల్పోయిన హాలీవుడ్‌ స్టార్స్‌..
హాలీవుడ్‌ స్టార్లు టామ్‌ హాంక్స్‌, రీస్‌ విథర్స్పూన్‌, స్పెన్సర్‌ ప్రాట్‌, హెడీ మోంటాగ్‌ వంటి నటుల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. మరికొందరి ఇళ్లు కూడా అగ్నికీలలకు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

స్పందించిన బైడెన్‌..
అధ్యక్షుడు జోబైడెన్‌ ఇక్కడి కార్చిచ్చుపై స్పందించారు. తరచూ అప్‌డేట్లు తెలుసుకొంటున్నట్లు వెల్లడించారు. అక్కడి ప్రజలకు అవసరమైన అన్నిరకాల సాయాలను శ్వేతసౌధం చేస్తుందన్నారు. స్థానిక అధికారులతో తన బృందం టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఫైర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ గ్రాంట్‌ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరారు.