రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పాలకేంద్రం నిర్వాహకుడు గణేష్ అరెస్ట్

రాజమండ్రి నగరంలోని లాలాచెరువు ప్రాంతంలో కలకలం సృష్టించిన కల్తీ పాల ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene glycol) అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారణ అయ్యింది. కోరుకొండ మండలానికి చెందిన గణేష్, రాజమండ్రిలోని లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ పరిసరాల్లో అనాధికారికంగా ఒక పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ కేంద్రం ద్వారా సుమారు 100కు పైగా కుటుంబాలకు ప్రతిరోజూ పాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాణాలు తీసిన రసాయనం..
బాధితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు, వారి శరీరంలోకి ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే రసాయనం చేరినట్లు ధ్రువీకరించారు. సాధారణంగా దీనిని కూలెంట్లు లేదా కొన్ని రకాల గడ్డి మందుల్లో ఉపయోగిస్తారు. పాల కేంద్రంలో ఈ రసాయనం అనుకోకుండా పాలల్లో కలిసిందా.. లేదా కావాలనే కలిపారా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ రసాయనం వల్ల బాధితుల్లో కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని, మూత్ర విసర్జన నిలిచిపోవడంతో (Anuria) పాలు తాగిన ఐదుగురు మరణించారని వైద్యులు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు సీరియస్..
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుతుల ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనాధికారికంగా కేంద్రం నడపడమే కాకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు అతనిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.