తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం సమర్పించిన ’తెలంగాణ విద్యా విధానం 2026: సమగ్ర విద్యా దృక్పథం’ నివేదికపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నూతన విధానం కింద, ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుండి 12వ తరగతి వరకు పూర్తిస్థాయి విద్యను అందించనున్నారు. వీటికి అవసరమైన బడ్జెట్‌ను రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు.
విద్యా కమిషన్ ప్రధాన సిఫార్సులు:
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2000 పాఠశాలలను అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. ప్రతి పాఠశాలకు సుమారు 1500 మంది విద్యార్థుల సామర్థ్యం ఉండేలా చూస్తూ, చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులను తీసుకురావడానికి ప్రత్యేక స్కూల్ బస్సు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రీస్కూల్ నుండి యూనివర్సిటీ విద్య వరకు, అలాగే ఓపెన్ లెర్నింగ్, సాంకేతిక విద్య, పాలనా సంస్కరణలపై 12 అధ్యాయాలతో కూడిన సమగ్ర నివేదికను కమిషన్ రూపొందించింది.
14 నెలల కసరత్తు, అంతర్జాతీయ అధ్యయనం
ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చరకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి గారు గత 14 నెలలుగా ఈ నివేదికపై విస్తృత కసరత్తు చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 305 విద్యాసంస్థలను సందర్శించారు. పంజాబ్, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల్లోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును అధ్యయనం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిపి మొత్తం 54 సమావేశాలు, 10 సెమినార్లు నిర్వహించి ఈ ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ సరికొత్త విద్యా విధానం ద్వారా తెలంగాణ పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


































