విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్‌లు
మూడు భారీ భవనాలు.. 12 పడక గదులు
అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు
1,41,438 చదరపు అడుగుల మేర నిర్మాణాలు
సెంటు ఇంటి కంటే ఇక్కడి బాత్‌రూంలే పెద్దవి
‘పేదల ప్రతినిధి’ కట్టించుకున్న పెత్తందారీ భవంతి
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం
అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్‌లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌లు మరిన్ని కట్టుకోవడం..! అయితే… రుషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్..! ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని… రూ.వందల కోట్ల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుపెట్టేశారు. ఏకంగా రూ.452 కోట్లతో విలాసవంతమైన నివాస, కార్యాలయ భవనాలు ఏడింటిని బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే మూడు ఉన్నాయి. వాటిలో పడక గదులు.. పన్నెండు! ప్రతీ పడక గదినీ అనుసంధానిస్తూ… అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదిని చూస్తేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై ఐదేళ్లూ తెగ ప్రేమ నటించిన జగన్ వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి..! దానిలో గరిష్ఠంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు. కానీ జగన్ బాత్రూం వైశాల్యమే 480 చదరపు అడుగులు…! అంటే పేదల ఇళ్లు జగన్ బాత్రూం అంత కూడా లేవన్న మాట..!
రాజసం ఉట్టిపడేలా ఖరీదైన గ్రానైట్‌తో తీర్చిదిద్దిన గదులు
ఇప్పటికే రూ.407 కోట్ల వ్యయం
రుషికొండపై భవనాలకు రూ.452 కోట్ల అంచనా వ్యయంలో రూ.407 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వ హంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. మళ్లీ తానే గెలుస్తానని, ముఖ్యమంత్రిగా 30 ఏళ్లపాటు తానే ఉంటానని జగన్ కలలుగన్నారు. అవన్నీ కల్లలైపోవడం వేరే విషయం. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి, రుషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్… కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు. రుషికొండపై గతంలో పర్యాటకశాఖ నిర్మించిన, చక్కగా, దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని… అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. ప్రముఖ హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ల డాలర్లు వెచ్చించి కట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాల్ని తలదన్నే స్థాయిలో వాటిని నిర్మించారు. అక్కడ సీఎం కోసం నివాస, కార్యాలయ భవనాల్ని కడుతున్నా… అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా, అధికారులు మాత్రం అవి రిసార్టులేనని బుకాయిస్తూ వచ్చారు. చివరిగా మరో నాటకానికి తెరతీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి, రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు. ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలూ పరిశీలించిందని, చివరకు రుషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు పెద్ద డ్రామా పండించారు. వాటిలో కొన్ని మార్పులు చేస్తే సీఎం నివాసానికి, కార్యాలయానికి చక్కగా సరిపోతాయని ఆమెతో చెప్పించారు. అదంతా పెద్ద డ్రామా…! వాటిలో ఏ మార్పులూ చేయక్కర్లేదు. నేరుగా వెళ్లి వాటిలో ఉండొచ్చు. కానీ వైకాపా వాళ్లు ఒకటి తలిస్తే ప్రజలొకటి తలిచారు. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు.
జగన్ ఉండేందుకు సకల సౌకర్యాలతో నిర్మించిన భవనం
రిసార్టు అయితే.. కార్యాలయ భవనాలెందుకు?
రుషికొండపై కడుతున్నది రిసార్టేనని వైకాపా నాయకులు చివరి వరకు బుకాయించారు. అది పర్యాటకుల కోసం కట్టినదైతే.. 7,266 చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరమేంటి? కళింగ బ్లాక్‌లోని రెండు భవనాలను కార్యాలయాల కోసమే నిర్మించారు. మొదటి అంతస్తు వరండాలో ఏర్పాటుచేసిన షాండ్లియర్ ఖరీదే రూ.2 లక్షలని చెబుతున్నారు. అలాంటివి ఆ ఒక్క వరండాలోనే పది వరకు ఉన్నాయి. భవనం మొత్తంలో చాలానే ఉన్నాయి.
- దీనిలో 300 నుంచి 500 మంది పట్టే భారీ సమావేశ మందిరం ఉంది. 200 మందికి పైగా కూర్చునేందుకు వీలుగా హోం థియేటర్ ఏర్పాటు ఉంది. మొదటి అంతస్తు కారిడార్ అత్యంత విలాసవంతంగా ఉంది. 50-100 మంది పట్టే సమావేశ మందిరాలు మరో మూడు నాలుగు ఉన్నాయి. వాటిలో అత్యాధునిక వ్యవస్థలన్నీ ఉన్నాయి.
- గజపతి, వేంగి బ్లాకుల్లోనూ విశ్రాంతి గదులు, సమావేశ మందిరాలనూ ఖర్చుకు వెనకాడకుండా ఆధునిక వసతులతో సిద్ధం చేశారు.
- అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ కోసమే సుమారు రూ.33 కోట్లు వెచ్చించారు. రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో రూ.50 కోట్ల వరకు వెచ్చించారు.
- ఆరుబయట సుందరమైన ల్యాండ్‌స్కేపింగ్ చేశారు. రాత్రివేళ చుట్టూ రకరకాల విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయేలా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు.
కళ్లు చెదిరేలా నిర్మాణాలు
రుషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం… అధికారంలో ఉన్నన్నాళ్లూ అనుమతి లేకుండా అక్కడికి చీమనూ చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెదేపా నాయకుల బృందం, మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం రుషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. రూ.400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి, దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసినవారికి కళ్లు చెదిరిపోయాయి. అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశద్వారాలు, విశాలమైన పడకగదులు, వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్‌లు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్లారా చూడాల్సిందే తప్ప… వర్ణించలేం. ఏ వైట్‌హౌస్‌లోకో, బకింగ్‌హాం ప్యాలెస్‌లోకో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. వాటిలో అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 1,312 రకాల వస్తువులు వినియోగించారు. ఇక ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్‌లు, సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు. నివాస భవనాల్లోంచి చూస్తూ కనుచూపు మేరలో విశాలమైన నీలిసముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు.
గదుల మధ్య ధగధగా మెరిసిపోతున్న విశాల మార్గం
ఒక కుటుంబానికి మూడు నివాస భవనాలెందుకు?
రుషికొండపై టూరిజం రిసార్టు ముసుగులో జగన్ కోసం కుట్రపూరితంగా కట్టిన నివాస, కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా, లెక్కలేనితనంతో ఖర్చుపెట్టేశారు. కళింగ, గజపతి, విజయనగర, వేంగి బ్లాక్‌ల పేరుతో మొత్తం ఏడు భవంతులు కట్టారు. వాటిలో విజయనగర బ్లాక్-1, 2, 3 పేరుతో ఖరీదైన విల్లాల్లా నిర్మించిన మూడు విలాసవంతమైన భవనాలు జగన్ నివాసం కోసమే..! ఒక్కో భవంతిలో నాలుగేసి పడక గదులు, విశాలమైన సమావేశ మందిరం నిర్మించారు. ఒక కుటుంబం కోసం మూడు భవంతులు, పన్నెండు పడక గదులు ఎందుకు?
- రుషికొండపై 9.88 ఎకరాల్లో 13,140 చదరపు మీటర్లు (1,41,438 చదరపు అడుగుల) నిర్మాణాలు చేపట్టారు. కళింగ బ్లాక్‌లోని రెండు భవనాలను సీఎం కార్యాలయం కోసం నిర్మించారు. గజపతి, వేంగి బ్లాక్‌లను సహాయ సిబ్బంది, ఇతర అధికారుల కోసం నిర్మించారు.
- ఆ భవనాలను భారీ స్తంభాలు, ప్రాకారాలతో ఇంద్ర భవనాల్లా తీర్చిదిద్దారు. భవనాల్ని అనుసంధానిస్తూ విశాలమైన నడవాలు నిర్మించారు. అన్ని గోడలకూ విదేశాల నుంచి తెచ్చిన పాలరాయిని తాపడం చేశారు. ఏ భవనం చూసినా శ్వేత, ముదురు గోధుమ వర్ణాలతో మెరిసిపోయేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారాలను పదడుగుల ఎత్తులో, అంతే వెడల్పుతో భారీగా ఏర్పాటుచేశారు. వాటికి ఇరువైపులా పాలరాయి నిర్మాణాలతో కూడిన ఎత్తయిన ఆకృతులు చెక్కారు.
- మొత్తం గదులు, స్నానాల గదులకు సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటుచేశారు. భవనాల్లో వినియోగించిన ఫ్యాన్లు, షాండ్లియర్లు, ఇతర పరికరాలన్నీ అత్యంత ఖరీదైనవే. వాటిలో చాలా వరకు విదేశాల నుంచీ దిగుమతి చేసుకున్నారు. వాటి ధరల్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నా… వాటిపై రాసి ఉన్న కంపెనీల ఆధారంగా ఆన్‌లైన్‌లో వెతికితే కొన్ని వస్తువుల ధరలు అంచనాగా తెలుస్తున్నాయి. ఉదాహరణకు… నివాస భవనంలో వాడిన ఫ్యాన్ ధర ఆన్‌లైన్‌లో రూ.35వేలుగా కనిపిస్తోంది.
- జగన్ కుటుంబం నివాసానికి కేటాయించిన మూడు భవనాలను మిగతావాటితో సంబంధం లేకుండా విడిగా, అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించలేని విధంగా భారీ ద్వారాలతో నిర్మించారు.
- ఆ భవనాల్లో ఒక్కో అంతస్తు వైశాల్యం 6వేల చదరపు అడుగులు. ప్రతి అంతస్తులో నాలుగు పడక గదులున్నాయి.
- ప్రతి పడక గదిలో లేత రంగులతో మెరిసిపోయే అత్యంత విలాసవంతమైన పడక మంచం, దాని రంగుకు నప్పేలా ఖరీదైన కుర్చీలు, టేబుల్, వర్కింగ్ టేబుల్ వంటివి ఏర్పాటు చేశారు. ఒక గదిలో ఉన్నలాంటి మంచం మరో గదిలో లేకుండా… 12 పడక గదుల్లో వేర్వేరు రకాల మంచాలు ఏర్పాటుచేశారు. ఈ గదులకు చుట్టూ ఆటోమేటిక్ అద్దాల తలుపులు, బయటి నుంచి ఎండ లోపలకు రాకుండా, ఆటోమేటిక్ కర్టెన్లు ఏర్పాటు చేశారు.
- వాటిలో హాలుకు రెండు వైపులా భారీ సోఫా సెట్లు ఏర్పాటుచేశారు. ఓపెన్ కిచెన్, సముద్రాన్ని చూస్తూ భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించారు. రెండువైపులా అతిథులు, సన్నిహితులతో ఏకాంతంగా మాట్లాడుకునేందుకు మరో రెండు గదులున్నాయి.
- స్నానాల గదుల్లో ప్రత్యేకంగా స్పా ఏర్పాట్లు చేశారు. కమోడ్లు, షవర్లు, కుళాయిలు అన్నీ ప్రసిద్ధ జపాన్ కంపెనీలకు చెందినవి వినియోగించారు.
- షవర్లు, కుళాయిలు బంగారు రంగుతో మెరిసిపోతున్నాయి. ప్రతి స్నానాల గదిలోనూ భారీ కప్ బోర్డులు ఏర్పాటు చేశారు. వంద అంగుళాల భారీ టీవీలు అమర్చారు.
- ప్రతి విల్లా రెండు అంతస్తులుగా నిర్మించగా… లోపలి నుంచే మెట్లు, లిఫ్టు సౌకర్యం ఏర్పాటుచేశారు.
- విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్, గ్రానైట్‌ని ఫ్లోరింగ్‌కి, మెట్లకు వినియోగించారు.
- జగన్ కుటుంబం నివాసం కోసం నిర్మించిన మూడు విల్లాలు సముద్రానికి అభిముఖంగా ఉంటాయి.
480 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్నానాల గది
బాత్ టబ్
ఆ భవనాలు చాల్లేదా జగన్?
జగన్‌కు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి… ఇలా ఊరూరా రాజభవనాల్ని తలదన్నే భవంతులున్నాయి. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వద్ద 5,807 చదరపు గజాల్లో 88,458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం ఉటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హరీష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నాలుగు డొల్ల కంపెనీలు పుట్టించినట్టు ఈడీనే నిగ్గుతేల్చింది.
పడక గది పక్కనే ‘స్పా’ సౌకర్యాలు
ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి
రుషికొండపై రిసార్టు పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో ఐదారుగురు ఐఏఎస్ అధికారులూ కీలకపాత్ర పోషించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వం మారి, రుషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం కనుసన్నల్లోనే మొత్తం కథ నడిపించినా… ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకున్నారు.
భవనంలోని ఓ భారీ హాలు
ముఖ్యులతో సమావేశం కోసం మందిరం
భవనాల ముందు నుంచి బీచ్ వ్యూ
రెండు భవనాల మధ్య మార్గంలో పైకప్పు
విలాసవంతమైన పడక గది
ఇవి ఫ్యాన్లే
విభిన్న ఆకృతుల్లో ఖరీదైన ఫ్యాన్లు