School Holidays In March 2026: ఫిబ్రవరి నెలలో పెద్దగా సెలవులు లేక నీరసించిపోయిన విద్యార్థులకు మార్చి నెల తీపి కబురు అందించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మార్చి నెలలో వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు లభించనున్నాయి.
ఈ 11 రోజుల సెలవుల్లో అటు పండుగలు, ఇటు వారాంతపు సెలవులు కలిసి చాలా ఉన్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మార్చి 19న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ, మార్చి 20వ తేదీన రంజాన్, మార్చి 27న శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి (ఆప్షన్ హాలీడే) వంటి పండుగల్లో స్కూళ్లకు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
వీటితో పాటు మార్చి 14న రెండో శనివారం కారణంగా స్కూళ్లకు సెలవు రానుంది. వీటితో పాటు మార్చి నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. ఇవి కూడా సెలవు దినాలుగా పరిగణించినా.. మార్చి నెలలో మొత్తంగా 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
మరోవైపు పరీక్షల సందడి..
ఒకవైపు సెలవులు ఉన్నప్పటికీ, ఇదే నెలలో కీలకమైన పబ్లిక్ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మార్చి 10 -25 తేదీల మధ్య పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు కూడా మార్చి నెలలోనే ప్రారంభం కానున్నాయి. మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
జనవరిలో సంక్రాంతి వంటి పండుగలతో 15 రోజులు సెలవులు ఆస్వాదించిన విద్యార్థులకు, ఫిబ్రవరిలో కేవలం వారాంతపు సెలవులే దక్కాయి. ఇప్పుడు మార్చిలో మళ్లీ వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల ఒత్తిడి మధ్య ఈ సెలవులు వారికి కొంత మానసిక ఉల్లాసాన్నిస్తాయని చెప్పవచ్చు.
చిన్న సూచన: పైన పేర్కొన్న సెలవుల తేదీలు ప్రభుత్వ అధికారిక క్యాలెండర్, స్థానిక పరిస్థితులపై ఆధారపడి మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు తమ పాఠశాల డైరీ లేదా నోటీసు బోర్డును అనుసరించడం మంచిది.


































