పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్- సినిమాల్లో కొనసాగడంపై జనసేనాని ట్విస్ట్

www.mannamweb.com


ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇకపై సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేయబోతున్నారా? పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాబోతున్నారా? అనే అనుమానం కలిగేలా అభిమానులకు హింట్ ఇచ్చేశారు పవన్. దీంతో ఆయన కామెంట్స్ ఒక్కసారిగా సంచలనంగా మారాయి.

ఇంతకూ పవన్ ఏమన్నారు ?

ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో గ్రామ సభలను తెరమీదకు తెచ్చారు పవన్ కల్యాణ్. సీఏం చంద్రబాబు కూడా దీనికి అంగీకారం తెలపడంతో గ్రామసభ లు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 13వేలకుపైగా పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా తన తొలి గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజక వర్గంలోని మైసూరువారిపల్లిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల కన్నా సమాజం ముఖ్యం అనీ సినిమాల కన్నా దేశం ఇంకా ముఖ్యం అనీ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్న పవన్ తాను సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూస్తా అన్నారు.. దానితో పవన్ ఇక సినిమాలకు పూర్తిగా దూరం జరగనున్నారు అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సినిమాల పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో సుజిత్ డైరెక్షన్‌లో వస్తున్న OG సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌లు పూర్తి కావడానికి కూడా పవన్ డేట్స్ కేటాయించాల్సి ఉంది. మరోవైపు రాజకీయాలు చేయాలి. ఆయన మంత్రిగా ఉండటంతో దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.

మొదటి నుంచి సినిమాల కన్నా ప్రజాసేవ వైపే మొగ్గు

పవన్ కు మొదటి నుంచీ ప్రజాసేవ మీదనే దృష్టి.పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా ఆ స్టార్ స్టేటస్ మరో 20 ఏళ్ళ కెరీర్ ఫణంగా పెట్టి మరీ రాజకీయాల్లోకి వచ్చేశారు పవన్. జనసేన స్థాపించి పదేళ్ళ పాటు ఎన్నో అవరోధాలు అవమానాలు ఎదుర్కొని ప్రస్తుత ఎన్నికల్లో 100,% స్ట్రైక్ రేట్‌తో పార్టీనీ గెలిపించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ అయిపోయారు. దానితో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవలే పవన్ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితిలో తాను OG అంటే ప్రజలు క్యాజీ అంటారంటూ జోక్ చేశారు కూడా. అయితే త్వరలోనే పెండింగ్ సినిమాల షూటింగ్ పూర్తి అవుతుంది అంటూ ఊపు తీసుకొచ్చారు. సినిమా నిర్మాతలు దర్శకులకు ఊరట కల్పించారు.

కానీ ఇప్పుడు పవన్ సినిమాల కంటే సమాజమే ముఖ్యం అంటూ అనడం చూస్తుంటే పవన్ ఇకపై కొత్త సినిమాల్లో నటించరా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి అభిమానుల్లో ..! అదే జరిగితే ఫ్యాన్స్ గుండెలు బద్దలు కావడం ఖాయం అంటున్నారు సినీ జనం.