పీపీపీ విధానంతో గుత్తేదార్లకు నిర్వహణ బాధ్యతతొలుత 18 రోడ్లు.. తర్వాత 68 రోడ్లలో అమలుకు యోచన
ఈనాడు, అమరావతి: జాతీయ రహదారులపై వాహనాల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
హైవేలపై ఎక్కడా గుంతలు కనిపించవు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కొత్త బీటీ లేయర్ వేస్తారు. మొత్తం నిర్వహణంతా గుత్తేదారే చూసుకుంటారు. ఇకపై రాష్ట్రంలోని పలు ఆర్అండ్బీ రోడ్లలో కూడా ఇటువంటి విధానమే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ద్వారా గుత్తేదార్లకు రోడ్ల నిర్వహణ అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏటా ఆయా రోడ్లలో వర్షాలకు గుంతలు పడితే.. వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు కోసం ఎదురుచూడటం, ఐదేళ్లకోసారి రెన్యువల్స్ వేసేందుకు అనుమతులు తీసుకోవడం.. చివరకు రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కల తొలగింపు కోసం కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపునకు వేచి ఉండాల్సి వస్తోంది. ఇటువంటిదేమీ లేకుండా పీపీపీ విధానంలో.. ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతంతా గుత్తేదారే చూసుకుంటారు. వాహన రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారు (స్టేట్ హైవే)ల్లో తొలి విడత 18 రోడ్లను, రెండో విడతలో 68 రోడ్లను ఎంపిక చేశారు.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
మొదటి విడత కింద ఎంపిక చేసిన 18 రోడ్లలో 1,307 కి.మీ., రెండో విడతలోని 68 రోడ్లకు చెందిన 3,931 కి.మీ.లలో పీపీపీ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నారు. దీని కోసం సలహా సంస్థలను ఎంపిక చేసుకొని, నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు నిధులు మంజూరు చేసింది. ఆయా రోడ్లలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది? మున్ముందు ఎంత పెరిగే అవకాశం ఉంటుంది? ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు కాకుండా ఇతర వాహనాలకు టోల్ ద్వారా ఎంత వసూలవుతుంది? అవి కాకుండా గుత్తేదారుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనేవి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.