ప్రముఖ ఆర్థిక నిపుణుడు..’రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం (Market Crash) రాబోతోందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యులు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి (Gold Silver) పై పెట్టుబడి పెట్టడమే ఉత్తమ మార్గమని ఆయన సూచిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే.. ఒక రోజు భోజనం మానేసి అయినా సరే వెండిని కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
10 డాలర్లతోనే ఆర్థిక విద్య
ఆర్థిక అక్షరాస్యత అనేది చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుందని కియోసాకి నమ్ముతారు. కేవలం 10 డాలర్లు (సుమారు 850 రూపాయలు) ఉన్నా సరే.. మీరు వెండి వ్యాపారి దగ్గరకు వెళ్లి చిన్న మొత్తంలో వెండిని కొనుగోలు చేయవచ్చు. “మీ దగ్గర 10 డాలర్లు లేకపోతే ఒక రోజు తినడం మానేయండి” అని ఆయన ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు. ఇలా వెండిని కొనడం వల్ల కేవలం లోహం మాత్రమే కాకుండా ఆ డీలర్ల ద్వారా డబ్బు ఎలా పనిచేస్తుంది అనే గొప్ప ఆర్థిక పాఠాలను కూడా నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
2026 లో భారీ మార్కెట్ క్రాష్?
2008 లో లెమాన్ బ్రదర్స్ పతనాన్ని ముందే ఊహించిన కియోసాకి.. ఇప్పుడు 2026 లో అంతకంటే భయంకరమైన సంక్షోభం రాబోతోందని భయపెడుతున్నారు. ప్రైవేట్ క్రెడిట్ స్కీమ్స్, పెరుగుతున్న అంతర్జాతీయ అప్పుల వల్ల ఈ పతనం సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ రిటైర్మెంట్ పొదుపు మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం వంటి ఆస్తులను సమకూర్చుకోవాలని ఆయన పదేపదే చెప్తున్నారు.
ఎందుకు వెండి అంటే అంత ఇష్టం?
రాబర్ట్ కియోసాకి దృష్టిలో బంగారం కంటే వెండి ఒక గొప్ప పెట్టుబడి సాధనం. దీనికి కారణం వెండి ధర సామాన్యులకు అందుబాటులో ఉండటమే. పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇది ఇచ్చే రక్షణ వెండిని ప్రత్యేకంగా నిలుపుతాయి. వెండి నిల్వలు తగ్గిపోతున్న కొద్దీ దాని ధర రాకెట్ లాగా దూసుకుపోతుందని, అప్పుడు తనలాంటి ఇన్వెస్టర్లు మరింత ధనవంతులు అవుతారని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి (Gold Silver) ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో వెండి ధర ఏకంగా 4.2 శాతం పెరిగి కిలో రూ.2,78,339 కి చేరుకుంది. బంగారం ధర కూడా 1.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,62,149 వద్ద ఉంది. అమెరికా డాలర్ బలహీనపడటం, మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కొంత తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో కియోసాకి సలహాలను చాలా మంది ఇన్వెస్టర్లు సీరియస్ గా తీసుకుంటున్నారు.

































