-కాకినాడ పోర్టులో రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ శివాలు
-యథేచ్ఛగా బియ్యం తరలిపోతుంటే అంతా ఏం చేస్తున్నారంటూ నిప్పులు
-డీఎస్‌వో, కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, పోర్టు అధికారులపై తీవ్ర ఆగ్రహం
-ఉద్యోగాలు చేస్తున్నారా.. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా అంటూ ఊగిపోయిన పవన్
-తానొచ్చినప్పుడల్లా జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడమేంటని మండిపాటు
-ప్రతిసారి ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తే గానీ బియ్యం అక్రమ రవాణా ఆగదా అని నిప్పులు
-పవన్ ప్రశ్నలు, నిలదీతలతో హడలెత్తిపోయిన అధికారులు, బియ్యం మాఫియాకు షాక్
-అటు సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా సాహసించి 9 నాటికల్ మైళ్ల ప్రయాణం
-తీరా నౌక దగ్గరకు వెళ్లాక పైకి ఎక్కనీయకుండా అధికారులు దొంగ ఎత్తులు
-అయినా వెళ్లి తీరాల్సిందేనంటూ పట్టుపట్టడంతో చేసేదిలేక తనిఖీలకు ఓకే
-రెండునెలలుగా తనను తనిఖీలకు రాకుండా అడ్డుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు
-పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లే నౌకను సీజ్ చేయాలని ఆదేశాలు: కాకినాడ ఎస్పీకి నోటీసులు
కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చుకోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రేషన్‌బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ శివాలెత్తారు. డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారులను పిలిచి ఏంచేస్తున్నారు మీరంతా అంటూ మండిపడ్డారు. కాకినాడ జిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు చెప్పినా కనీసం స్పందన లేదని దునుమాడారు. తాను జిల్లాకు ఎప్పుడు వచ్చినా సెలవుపై ఉంటున్నారు.. అంటూ మండిపడ్డారు. ఆయనకు నోటీసులు పంపాలని ఆదేశించారు. కాకినాడపోర్టు ప్రమాదకరంగా మారిందని, దీనిపై ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని హెచ్చరించారు.
యాంకరేజ్ పోర్టులో బియ్యం పరిశీలన
కాకినాడ పోర్టులో పవన్‌కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత 12.45గంటలకు యాంకరేజ్ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. ఇందులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండడంతో ఇటీవల అధికారులు పట్టుకున్నారు. నేరుగా పవన్ బార్జి ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫియాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతుందని శివాలెత్తారు. హూఈజ్ ఆలీషా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు చేస్తున్నారా.. మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును ఉద్దేశించి దీనిపై మరింత గట్టి పోరాటం చేయాలని, నెమ్మదిగా ఉండకూడదని పేర్కొన్నారు. అనంతరం అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత డీప్‌వాటర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా..
తుఫాను ముప్పు నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పవన్ సముద్రంలోకి వెళ్తారని అధికారులు అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన టగ్ ఎక్కి తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పశ్చిమ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామా వద్దకు బయలుదేరారు. సముద్రం భయానకంగా ఉండడంతో అధికారులు వద్దని వారించారు. అయినా పవన్ వినలేదు. నౌకవద్దకు వెళ్లిన తర్వాత పైకి ఎక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640టన్నుల బియ్యాన్ని పరిశీలించాలి. కానీ వాతావరణం బాగోలేదని, నౌకపైకి ఎక్కొద్దని అధికారులు పవన్‌కు తెలిపారు. సముద్ర ప్రయాణం మధ్యలో పవన్ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మొత్తం సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అయ్యిందన్నారు. డీఎస్‌ఓ ప్రసాద్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, పోర్టు అధికారి ధర్మశాస్త్ర, డీఎస్పీ రఘువీర్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్ పనామా భారీ నౌకను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ యాంకరేజ్‌పోర్టులో పూర్తిస్థాయిలో అధికారులు దృష్టిపెట్టాలన్నారు. పోర్టులో ఉన్న రెండు చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు నిఘా ఉండాలన్నారు.
కాకినాడలో దారుణంగా రేషన్ మాఫియా
మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరిగి డీప్‌వాటర్ పోర్టుకు చేరుకున్న పవన్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. రేషన్ మాఫియా కాకినాడలో దారుణంగా ఉందని, తనను నౌక ఎక్కనీయకుండా అధికారులు అడ్డుకున్నారని పేర్కొని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండునెలలుగా కాకినాడ పోర్టులో తనిఖీలకు తనను రాకుండా అధికారులు ఏవో సాకులు చెప్పి అడ్డుకుంటున్నారని గుర్తు చేసి బాంబు పేల్చారు. అలా అయితే తానే వస్తానని, పోలీసు సిబ్బంది కూడా వద్దని హెచ్చరించడంతో అప్పుడు అంగీకరించారన్నారు. తాను ఢిల్లీ నుంచి అమరావతి వెళ్లాలని, కానీ రేషన్ మాఫియా తీవ్రత నేపథ్యంలో కాకినాడ పర్యటనకు వచ్చానని తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం పవన్ అమరావతికి బయలుదేరారు.
గ్రీన్‌ఛానల్ ద్వారా తరలింపు
అంతకుముందు మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత జూన్‌లో కాకినాడలో తనిఖీ చేసినప్పుడు 26వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నామన్నారు. బియ్యం మాఫియా గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసుకుని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో యథేచ్ఛగా బియ్యం మాఫియా చెలరేగిపోయిందన్నారు. ఎన్నిసార్లు నిరసనలు చేపట్టినా ఒక్క సమీక్ష కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఐవేరి కోస్ట్‌లో గొడౌన్లు నిర్మించి ఇష్టారాజ్యంగా అక్రమంగా బియ్యం వ్యాపారం చేశారని ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడే వ్యాపారం చేశారనీ, ఇప్పుడు బినామీలు చేస్తున్నారని ఆరోపించారు.
డీఎస్‌వోపై వేటు
పౌరసరఫరాలశాఖ కమిషరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశం
మామూళ్లతో ‘చెక్’ కథనంతో అధికార యంత్రాంగంలో కదలిక
కాకినాడ జిల్లా పౌరసరఫరాలశాఖ అధి కారిపై వేటుపడింది. కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీ చేసే చెక్‌పోస్టుల్లో అక్రమాలు జరుగుతు న్నాయని ఆంధ్రజ్యోతిలో శుక్రవారం కథనం ప్ర చురితమైంది. పోర్టువద్ద చెక్‌పోస్టుల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు సొమ్ములు తీసుకుని పీడీఎస్ బియ్యం రవాణాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారని అం దులోని సారాంశం. దీంతో స్పందించిన ఉన్నతా ధికారులు డీఎస్‌వోను సెలవులోకి పంపించారు. శుక్రవారం అకస్మాత్తుగా డిప్యూటీ సీఎం పవన్ కూడా పోర్టుకు రావడం.. ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో డీఎస్‌వో ను పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జిడీఎస్‌వోగా ఏఎస్‌వో ప్రసన్నల క్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యం లో మిగిలినఅధికారుల్లోను వణుకు మొదలైంది.