Success Story: వాడిన పూలతో రూ.100 కోట్లు సంపాదన.. సూపర్ సక్సెస్ స్టోరీ..

Phool Startup: డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంటే చాలు ఆలోచనలు అవే పుట్టుకొస్తాయని మరోసారి ఒక స్టార్టప్ నిరూపించింది.
మకర సంక్రాంతి రోజున కాన్పూర్‌కు చెందిన అంకిత్ అగర్వాల్ తన చెక్ రిపబ్లిక్ స్నేహితుడితో కలిసి గంగానది ఒడ్డున కూర్చున్నాడు. శుభ్రంగా లేని నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయటంపై అతడి మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకొచ్చిన వాడిపోయిన పూలను నదిలో పోయటం చూసిన అతని మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టింది. అదే ఫూల్ స్టార్టప్.
ఫూల్ సంస్థ దేశంలోని వివిధ దేవాలయాల్లో దేవుడికి అలంకరించి తీసేసిన పువ్వులను సేకరిస్తుంది. వాటి నుంచి ధూప్ స్టిక్స్, అగర్ బత్తీలు వంటి పూజా ద్రవ్యాలను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి వాడిపోయిన పూలను వ్యర్థాలుగా చేయటం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా రూ.100 కోట్లు విలువైన కంపెనీని నిర్మించారు. ఈ స్టార్టప్ కాన్పూర్, తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజూ దాదాపు మూడున్నర టన్నుల పూలను సేకరిస్తోంది. తొలుత వీరి వ్యాపారం 2 కేజీల పూలు, రూ.72 వేల పెట్టుబడితో ప్రారంభమైంది.
మిత్రులైన అపూర్వ, అంకిత్ తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్లి వినియోగించిన పూలను పారేయకుండా తమకు ఇవ్వమని ఒప్పించటంలో చాలా కష్టపడ్డారు. అయితే వాటిని తిరిగి దేవుని కోసం వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పటంతో ఒప్పుకున్నారు. తొలుత పూలను సేకరించి కర్మాగారానికి తీసుకెళ్లి వాటిలోని తేమను తొలగించే ప్రక్రియను చేపడతారు. యంత్రాలతో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు. తర్వాత పిండిగా మార్చిన పూలను అగర్ బత్తిల తయారీకి వినియోగిస్తారు. ఫూల్ ప్రారంభంలో సోషల్ ఆల్ఫా, DRK ఫౌండేషన్, IIT కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి రూ.3.38 కోట్లను సేకరించింది. కరోనా లాక్‌డౌన్ అయిన రెండున్నర నెలల కాలంలో కంపెనీకి ఆదాయం లేదు కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి. ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం 4 నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి. అలా అనేక కష్టాలను అధిగమించి 2018లో వెబ్‌సైట్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు. అలా ఈ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం విలువ రూ.100 కోట్లకు పైగా చేరుకుంది.