పల్లీలు లేకుండా రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద చేసే టేస్టీ చట్నీ (సీక్రెట్).. పల్లీలు, కొబ్బరి లేకుండానే రుచికరమైన పల్చటి చట్నీని సులభంగా తయారు చేయవచ్చు.
ఇంట్లో సాధారణంగా ఉండే పదార్థాలతో ఈ చట్నీని రోడ్‌సైడ్ బండ్ల మీద చేసినట్లుగా రుచిగా తయారు చేయొచ్చు.
ఈ చట్నీ వేడి వేడి ఇడ్లీలు, దోసెలతో పాటు వడలు, పొంగనాలతో కూడా అద్భుతంగా సరిపోతుంది. ఈ చట్నీ రుచి కోసమే ఇడ్లీలు తినాలనిపించేంత బాగుంటుంది! మరి ఈ సింపుల్, రుచికరమైన చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం!
కావాల్సిన పదార్థాలు:
– ఎండుమిర్చి – 8
– జీలకర్ర – 1 టీస్పూన్
– చింతపండు – కొద్దిగా
– అల్లం ముక్కలు – 2
– పొట్టు తీసిన వెల్లుల్లి – 6 రెబ్బలు
– పుట్నాల పప్పు – 1½ కప్పులు
– ఉల్లిపాయ ముక్కలు – 2
– ఉప్పు – రుచికి సరిపడా
తాలింపు కోసం:
– ఆవాలు – ½ టీస్పూన్
– జీలకర్ర – ½ టీస్పూన్
– ఎండుమిర్చి – 3
– కరివేపాకు – 2 రెమ్మలు
– కొత్తిమీర తరుగు – కొద్దిగా
తయారీ విధానం:
1. ముందుగా స్టవ్ వెలిగించి, కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు వేయించండి.
2. తర్వాత కరివేపాకు, చింతపండు వేసి మరో నిమిషం వేయించి, ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి.
3. మిక్సీ జార్లో 1½ కప్పుల పుట్నాల పప్పు, చల్లారిన ఎండుమిర్చి మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
4. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మళ్లీ మెత్తగా గ్రైండ్ చేసి, చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
5. తాలింపు కోసం, స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఎండుమిర్చి వేసి కాసేపు వేయించండి.
6. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసిన చట్నీలో కలపండి.
7. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి, వేడి వేడిగా ఇడ్లీ, దోసె లేదా వడలతో సర్వ్ చేయండి.
ఈ పల్చటి చట్నీ మెత్తని దోసెలు, వడలతో అద్భుతంగా సరిపోతుంది. ఈ సులభమైన పుట్నాల పప్పు చట్నీ తయారీ విధానం మీకు నచ్చితే, ఒకసారి ట్రై చేసి చూడండి!
































