Tax Free Income: ఈ 10 రకాల ఆదాయంపై నో ట్యాక్స్.. మన దేశంలోనే.. దర్జాగా సంపాదించుకోవచ్చు

Tax Free Income: పరిమితికి మించి సంపాదిస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని అందరికి తెలిసిందే. ఆదాయపు పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వం భారీగా పెనాల్టీలు వేస్తుంది. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే, కొన్ని మార్గాల ద్వారా ఎంత సంపాదించినా ఒక్క రూపాయి ట్యాక్స్ ఉండదని చాలా మందికి తెలియదు. 10 రకాల ఆదాయం ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. మరి ఆ పది రకాల ఆదాయాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tax Free Income: ప్రతి ఒక్క వ్యక్తి అతను ఉద్యోగి కావచ్చు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారు కావచ్చు పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తున్నప్పుడు ప్రతి ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే,చాలా మందికి తెలియిన చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మార్గాల ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్నులు ఉండవు. వాటి ద్వారా దర్జాగా సంపాదించుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని నిబంధనల ప్రకారం కొన్ని మార్గాల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించారు. అలా 10 రకాల ట్యాక్స్ ఫ్రీ ఇన్‌కమ్ మార్గాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.


1.వ్యవసాయ ఆదాయం
వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పూర్తి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అలాగే ఎంతైనా సంపాదించవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు పంట సాగు, పంట విక్రయం, భూమి కౌలుకు ఇవ్వడం వంటి వాటికి ఎలాంటి ట్యాక్స్ ఉంటదు. అయితే, వ్యవసాయ ఆదాయం రూ.5 వేలు దాటి మొత్తం ఆదాయ అనేది బేసిక్ మినహాయింపు పరిమితి దాటితే రెట్ కాలిక్యులేషన్ కోసం లెక్కలోకి తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

2.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రిటర్న్స్
కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది EEE ట్యాక్స్ మినహాయింపు కలిగి ఉంటుంది. ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తుంది. ఇందులో వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

3.ఈపీఎఫ్ విత్‌డ్రావల్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి ఉపసంహరించే నగదు ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. అయితే, 5 ఏళ్ల ఆపైన వరుస సర్వీసు ఉన్న వారికే వర్తిస్తుంది. ఉద్యోగి కంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, వడ్డీ కలిపి ఇందులో ఉంటాయి. కొత్త, పాత పన్ను విధానాలు రెండింటిలోనూ మెచ్యూరిటీ అమౌంట్, వడ్డీ ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది.

4. లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చే మెచ్యూరిటీ లేదా డెత్ క్లెయిమ్ అమౌంట్ అనేది పూర్తిగా పన్ను మినహాయింపు కలిగి ఉంటుంది. డెత్ క్లెయిమ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. ఎలాంటి అప్పర్ లిమిట్ ఉండదు.

5. ఉపకారవేతనాలు
విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్ 100 శాతం ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ లేదు. ఎడ్యుకేషన్ అవసరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

6. కానుకలు
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువుల వంటి నిర్దేశిత బంధువుల నుంచి తీసుకునే కానుకలు పూర్తి ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి. అలాగే ఆర్థిక ఏడాదిలో రూ.50 వేల వరకు ఎలాంటి కానుకలు అందుకున్నా ట్యాక్స్ ఉండదు.

7. వీలునామా, వారసత్వంతో వచ్చే ఆస్తులు
వీలునామా ద్వారా వచ్చే ఆస్తులు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి. ఎలాంటి వారసత్వ ట్యాక్స్ లేదు. అయితే, ఆ ఆస్తుల ద్వారా ఏదైనా ఆదాయం సంపాదిస్తే మాత్రం ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లు, బాండ్లపై వచ్చే వడ్డీ వంటివి ఇందులోకి వస్తాయి.

8. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్
కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలోపు ఆడ పిల్లల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (SSY)లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రిటర్న్స్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. వడ్డీ, మెచ్యూరిటీ బెనిఫిట్స్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

9.బాండ్లు
ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే వాటిపై వచ్చే వడ్డీకి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ బాండ్లను ప్రభుత్వ మద్దతుగల సంస్థలు జారీ చేస్తుంటాయి.

10.గ్రాట్యుటీ
ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే గ్రాట్యుటీ బెనిఫిట్ పూర్తిగా పన్ను మినహాయింపు కలిగి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులు అయితే, రూ.20 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.