Tax Refund: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఇంకా చాలా మందికి ఐటీ రీఫండ్స్ రాలేదు. అయితే ఇప్పుడు వారందరికీ రీఫండ్ పెండింగ్ సంబంధించిన మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మెసేజ్ కారణంగా ఓ ట్యాక్స్ పేయర్ రూ.1.50 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది. మరి ఆ మెసేజ్‌లో ఏముంది? ఆదాయపు పన్ను శాఖ ఏం చెబుతోంది? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
Tax Refund: గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసిన చాలా మందికి ఇంకా రీఫండ్స్ రాలేదు. 20 లక్షలకు పైగా ఐటీఆర్‌ల ప్రాసెస్ పెండింగ్‌లో ఉన్నట్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆ తర్వాత చాలా మందికి రీఫండ్స్ జారీ అయినట్లు సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు చేశారు. అయినప్పటికీ ఇంకా లక్షల మంది తమ రీఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ డిలే అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే, ఈ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సూచించింది. ఓ ట్యాక్స్ పేయర్ ఫేక్ రీఫండ్ డిలే మెసేజ్ కారణంగా రూ.1.50 లక్షలు కోల్పోవాల్సి వచ్చినట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఐటీఆర్ దాఖలు చేసి నెలలు గడుస్తున్నా ఇంకా లక్షల మందికి రీఫండ్స్ జారీ కాలేదు. దీంతో మోసగాళ్లు తెరపైకి వచ్చారు. ఫిషింగ్ మెసేజ్‌లు, ఫేక్ పోర్టల్స్ ద్వారా ట్యాక్స్ పేయర్లకు గాలం వేస్తున్నారు. నమ్మి వారు పంపించిన మెసేజ్‌లకు స్పందించిన వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ట్యాక్స్ అడ్వైజరీ ప్లాట్ ఫారం ట్యాక్స్ బడ్డీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ మోసానికి సంబంధించి ఓ పోస్ట్ చేసింది. ‘మీ రీఫండ్ పెండింగ్‌లో ఉందని, అర్జెంట్‌గా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది’ అని పలు లింకులను పంపిస్తున్నారు. ఆ లింకులపై క్లిక్ చేసినప్పుడు నకిలీ వెబ్‌సైట్లోకి వెళ్తారు. అందులో పాన్ నంబర్, లాగిన్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. వెరిఫికేషన్ పేరుతో ఓటీపీ రిక్వెస్ట్ ఉంటుంది. బ్యాంక్ వివరాలు సైతం అడుగుతారు. వివరాలు ఇచ్చినట్లయితే వారి బ్యాంక్ అకౌంట్లను యాక్సెస్ చేస్తారు. ఒక ట్యాక్స్ పేయర్ రూ.1.50 లక్షలు కోల్పోయినట్లు ట్యాక్స్ బడ్డీ తెలిపింది.
రీఫండ్ సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ట్యాక్స్ పేయర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక రీఫండ్ డిలే లేదా మీకు డబ్బులు రావు అనేవి అత్యవసర పరిస్థితిని ఏర్పరుస్తాయి. దీనినే మోసగాళ్లు ఉపయోగిస్తున్నారు. భయపెట్టేలా భాష ఉపయోగించడం, ఇదే చివరి అవకాశం, రీఫండ్ రద్దు అవుతుంది, తక్షణం స్పందించాల్సిన అవసరం అనేవి చెబుతూ ఎమర్జెన్సీని క్రియేట్ చేసి వివరాలు సేకరిస్తారు. క్షణాల్లో అకౌంట్లను ఖాళీ చేస్తారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఏం చెబుతోంది?
ఈ మెసేజ్‌లపై ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం క్లారిటీ ఇచ్చింది. తాము ఎలాంటి ఓటీపీలు పంపిచడం లేదని, ఫోన్ కాల్స్ మెసేజ్‌లు పంపించమని తెలిపింది. ఇ-మెయిల్స్ ద్వారా పాస్‌వర్డ్స్, బ్యాంక్ వివరాలు ఇవ్వకూడదని సూచించింది. రీఫండ్ స్టేటస్ కేవలం అధికారిక ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తనిఖీ చేయాలని కోరింది. మెసేజ్‌ల్లో కనిపించే లింకులపై క్లిక్ చేయకుండా సర్చ్ చేసి అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలని సూచించింది.



































